‘పవన్‌కల్యాణ్ కోపంలో అర్థం ఉంది. ఆయన మాట్లాడిన ప్రతి విషయంలోనూ న్యాయం ఉంది. నేను పూర్తిగా ఆయనకు ఏకీభవిస్తున్నా. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక మేం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశాం. కానీ సినిమారంగంలో ప్రముఖులమని చెప్పుకునే చాలామంది.. పవన్ మాకు తెలుసు అనుకున్నారే గానీ.. ఆయన్ను కలవాలనే ఆలోచన మాత్రం ఎవరూ చేయలేదు. ఇది పూర్తిగా తప్పు. ‘జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేద్దాం అనుకుంటున్నాం.. మీటింగులకి రండి..’ అని నన్ను కూడా పిలిచారు. ఈ విషయంపై మూడుసార్లు ఛాంబర్లో మీటింగులు జరిగాయి.
కానీ నేను ఏ మీటింగుకీ వెళ్లలేదు. వారి నిర్ణయం సమంజసంగా అనిపించలేదు కాబట్టే మీటింగులకు దూరంగా ఉన్నా. థియేటర్లకు సమస్యలున్నాయి. వాటిని ప్రభుత్వంతో కలిసి చర్చించి పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అంతేకానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎలా?. అయినా పవన్‌కల్యాణ్ సినిమా విడుదల కాబోతున్న సందర్భంలో థియేటర్లు మూసేస్తామని అనడం నిజంగా దుస్సాహసమే.’ అని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. చిత్రపరిశ్రమలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు.
ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇంకా మాట్లాడుతూ ‘ ‘ఆ నలుగురు’ అంటూ గత రెండుమూడు రోజులుగా వార్తలొస్తున్నాయి. ఆ నలుగురి కబంధ హస్తాల్లోనే ఇండస్ట్రీ ఉన్నట్టు, ప్రస్తుత పరిణామాలకు ఆ నలుగురే కారణం అన్నట్టు వార్తలు రాస్తున్నారు. అందరూ అనుకుంటున్న ‘ఆ నలుగురు’లో నేను లేను. ఆ నలుగురికీ నాకూ ఎలాంటి సంబంధం లేదు. నిజానికి ‘ఆ నలుగురు’ అనేది 15ఏళ్లనాటి మాట. ఇప్పుడు అలాంటివాళ్లు పదిమంది తయారయ్యారు.’ అని అల్లు అరవింద్ గుర్తుచేశారు. ‘సినిమాలు నిర్మించడం మాత్రమే నా వృత్తి.
50ఏండ్లుగా అదే వృత్తిలో ఉన్నా. థియేటర్ల వ్యాపారం నుంచి కోవిడ్ సమయంలోనే బయటకు వచ్చేశా. తెలుగురాష్ర్టాల్లో ప్రస్తుతం నాకుంది 15 థియేటర్లు మాత్రమే. అవి కూడా త్వరలో ఉండవ్. లీజు పూర్తయ్యాక రెన్యువల్ చేయొద్దని స్టాఫ్‌కి చెప్పేశాను. ఏదిఏమైనా.. సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి.. పోరాడి, డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తి పవన్‌కల్యాణ్. ఆయన సినిమా విడుదల సమయంలో ఇలాంటి పరిణామాలు తలెత్తడం బాధాకరం’ అని అల్లు అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు.