Ileana | అసలు ఉందో లేదో అన్నట్టుగా ఉన్న తన పిడికెడంత నడుము ఒంపుల్లో పోరగాళ్లందరినీ గింగిరాలు తిప్పేసింది ఇలియానా. ఈ గోవా బ్యూటీ నడుం అందాలను చూసి మనసు పారేసుకోని పోరగాడు లేడంటే నమ్మండి. తనదైన అందం, అభినయంతో సినీ ప్రేక్షకులందరూ తనతో ప్రేమలో పడేలా చేసిన ఈ చిట్టి నడుము చిన్నది తాను మాత్రం యూఎస్‌కు చెందిన మైఖేల్ డోలన్‌తో ప్రేమలో పడింది.
కొంతకాలం ప్రేమించుకున్న ఈ జంట 2023లో పెండ్లి పీటలెక్కడం, వీరి ప్రేమకు గుర్తుగా అదే ఏడాది చివరిలో ఓ బుడ్డోడు పుట్టడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తన కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్, భర్త డోలన్‌తో ఆనందంగా జీవితం గడుపుతున్న ఇలియానా ఇటీవల ప్రేమ గురించి చెప్పిన పాఠాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
ప్రేమ పాఠాలు అనగానే ఏవేవో ఊహించుకోకండి. ఆమె చెప్పింది స్వీయ ప్రేమ గురించే సుమా! ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె చెప్పిన స్వీయ ప్రేమ ముచ్చట్లు ఆసక్తిగా ఉన్నాయి. తన భాగస్వామితో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పిన ఇలియానా డోలన్‌ను ఉద్దేశిస్తూ ‘ఎప్పటికీ ఉత్తమమైన వ్యక్తి’ అని ట్యాగ్ చేసింది. స్వీయ నియంత్రణతో గుండె పగలకుండా ఆపడం ఎలాగో రాసి ఉన్న ఓ పేజీని షేర్ చేసింది. దురుసుగా ప్రవర్తించడం మంచిదికాదని, వ్యక్తిత్వం కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకూడదని చెప్పుకొచ్చింది.
మనల్ని మనం ప్రేమించుకోకపోతే మనల్ని ప్రేమించలేని వ్యక్తులకు లోకువ కాక తప్పదని హెచ్చరించింది. సో, ఈ కందిరీగ నడుం సుందరి చెప్పినట్టు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఇప్పుడే మొదలుపెట్టండి. అలా కొన్నాళ్లు పోతే దాని ఫలితం మీకే తెలుస్తుంది! అన్నట్టూ.. ఇలియానా త్వరలో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లో వెండితెరపై మళ్లీ కనిపించనుంది. ‘దో ఔర్ దో ప్యార్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, సెంథిల్ రామమూర్తి కూడా నటించారు. శిర్షా గుహా ఠాకుర్తా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్నది.