Ilayaraja’s donation to the Indian Defense Ministry | ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా భారత రక్షణ శాఖకు తన ఒకరోజు పారితోషికాన్ని విరాళంగా ప్రకటించారు. పహల్గామ్లో భారత పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇళయరాజా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు.
“పహల్గామ్లో మన దేశ పర్యాటకులపై ఉగ్రమూక దాడి చేసింది. దీనికి మన దేశ సైనికులు తప్పక ప్రతీకారం తీర్చుకోవాలి. వారి ధైర్య సాహసాలు అభినందనీయం. మన సైనికులు ఆత్మస్థైర్యంతో వారిని మట్టు పెడతారనే నమ్మకం నాకు ఉంది. దేశ పౌరుడిగా, ఎంపీగా నా ఒకరోజు పారితోషికాన్ని దేశ రక్షణ శాఖకు విరాళంగా ప్రకటిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొంది.