Agastya Nanda | బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇక్కిస్ (Ikkis). ఈ సినిమా విడుదల తేదీని మ్యాడాక్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ వార్ డ్రామా చిత్రం 2025 అక్టోబర్ 2న, గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఒక ఆసక్తికరమైన అనౌన్స్మెంట్ టీజర్‌ను విడుదల చేసింది.
‘ఇక్కిస్’ చిత్రం 1971 ఇండో-పాక్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా తెరకెక్కబోతుంది. పరమ వీర చక్ర పురస్కారం పొందిన అతి పిన్న వయస్కులలో ఒకరైన ఖేత్రపాల్ ధైర్యం, త్యాగాలను ఈ సినిమా చూపించబోతుంది. విడుదలైన టీజర్లో 1971 నాటి బాసంతర్ యుద్ధం సమయంలో పంపిన ఒక టెలిగ్రామ్ కనిపిస్తుంది. ఆ టెలిగ్రామ్ అరుణ్ ఖేత్రపాల్ మరణ వార్తను తెలియజేస్తుంది. ఈ టీజర్ యుద్ధ సన్నివేశాలతో పాటు ఖేత్రపాల్ శౌర్యంగా పోరాడుతున్న దృశ్యాలను చూపిస్తూ ఉత్కంఠగా సాగింది.
ఈ సినిమాలో అగస్త్య నందాతో పాటు సీనియర్ నటుడు ధర్మేంద్ర, పాతాల్ లోక్ నటుడు జైదీప్ అహ్లవత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అగస్త్య నందా గతంలో జోయా అక్తర్ రూపొందించిన ‘ది ఆర్చీస్’ (2023) సినిమాతో నెట్‌ఫ్లిక్స్‌లో అరంగేట్రం చేశారు. ‘ఇక్కిస్’ ఆయనకు థియేట్రికల్ అరంగేట్రం కావడం విశేషం. ఈ సినిమా విడుదలపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.