Kantara Chapter 1 | కన్నడ నుంచి రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌లలో ‘కాంతార: చాప్టర్ 1’ ఒకటి. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తుంది. ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. వరల్డ్‌వైడ్‌గా అక్టోబర్ 02 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేయగా.. యూట్యూబ్‌లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
అయితే ఈ చిత్రం విడుదలకు ముందు ఈ సినిమాను చూడాలంటే కాంతార దీక్షను ప్రజలు చేపట్టాలని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాను చూడాలంటే ప్రజలందరూ భక్తితో మాంసం, మద్యం, పొగాకు మానేసి నియమ నిష్ఠలతో ఉండాలని అందులో రాసి ఉంది. దీంతో ఇది నిజమే అనుకొని చిత్రబృందంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. కొందరూ అయితే ఫస్ట్ పార్టులో నటుడు పందిని తింటే తప్పు లేదుకాని మేము నచ్చింది తినకూడదా అంటూ కామెంట్లు పెట్టారు. అయితే ఈ వివాదంపై రిషభ్ తాజాగా స్పందిస్తూ.. అవన్నీ ఫేక్ వార్తలని వాటిని నమ్మకండని తెలిపాడు.
నో స్మోకింగ్, నో ఆల్కహాల్, నో మీట్ అనే పోస్టర్ని చూసి నేను షాక్ అయ్యాను. వెంటనే మా నిర్మాణ సంస్థను సంప్రదించి ఆ పోస్టర్ నిజమా కాదా అని నిర్ధారించుకున్నాను. అది ఎవరో కావాలని సృష్టించిన ఫేక్ పోస్టర్ అని తేలింది. అలాంటి తప్పుడు ప్రచారాలపై మేం స్పందించాలని కూడా అనుకోవడం లేదు అని రిషబ్ శెట్టి తెలిపారు. మరోవైపు ఈ వివాదంపై నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిలిమ్స్’ కూడా స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, ఇవి కేవలం సినిమాకు చెడ్డ పేరు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలని వెల్లడించింది. కాంతార చిత్రం సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో రూపొందిందని అది ఏ వర్గాన్ని కానీ, వారి అలవాట్లను కానీ కించపరచడానికి ఉద్దేశించినది కాదని నిర్మాణ సంస్థ వివరించింది.