తమిళ అగ్ర నటుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన విభిన్న కథాచిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ సినిమా ‘ఇడ్లీ కొట్టు’ పేరుతో అక్టోబర్ 1న తెలుగులో విడుదల కానుంది. నిత్యామీనన్ కథానాయిక. డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకాలపై ఆకాశ్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ వేదక్షర మూవీస్ ద్వారా రామారావు చింతపల్లి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
‘గ్రైండర్ కొంటే పని తేలికవుతుంది.. సమయం కూడా ఆదా అవుతుంది..’ అని తండ్రిని ఒప్పిస్తూ ధనుష్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ఆద్యంతం ఆసక్తికరంగా ట్రైలర్ సాగింది. సంప్రదాయ ఇడ్లీకొట్టు నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని ట్రైలర్ చెబుతున్నది. బడా వ్యాపారస్థుల కారణంగా తన ఇడ్లీకొట్టు మనుగడకే ముప్పు వాటిల్లినప్పుడు ఆ సవాళ్లను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? తన గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు హీరో చేసే పోరాటమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ అని తెలుస్తున్నది.
ట్రైలర్లో ధనుష్, రాజ్‌కిరణ్ తండ్రీకొడుకులుగా కనిపించారు. అరుళ్విజయ్ ప్రతినాయకుడిగా అలరించారు. నిత్యామీనన్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ధనుష్, నిత్యాల కెమిస్ట్రీ కూడా బావుంది. షాలినీ పాండే, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్.