NP50 | మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసి, సౌత్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న కల్ట్ క్లాసిక్ చిత్రం ‘ప్రేమమ్’ గుర్తుంది కదా. ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకోవడమే కాకుండా, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ లాంటి స్టార్ హీరోయిన్లను పరిచయం చేసిన మ్యాజికల్ కాంబినేషన్ నివిన్ పౌలీ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రన్. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘నేరమ్’, ‘ప్రేమమ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి. ఇప్పుడు సరిగ్గా 11 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబో మళ్లీ రిపీట్ కాబోతుండటంతో సినిమా ప్రేమికుల్లో అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
మాస్ అండ్ క్లాస్ హీరో నివిన్ పౌలీ కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 50వ మైల్స్టోన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు “విజయం” అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కొచ్చిలోని ప్రముఖ పద్మ థియేటర్లో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ చిత్రం ఒక సరికొత్త జోనర్లో.. హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా, ముఖ్యంగా బైక్ రేసింగ్ నేపథ్యంతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందనుంది.
ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏమిటంటే, దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ కేవలం మెగాఫోన్ పట్టడమే కాకుండా, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ మరియు కలర్ గ్రేడింగ్ వంటి కీలక బాధ్యతలను కూడా ఆయనే స్వయంగా చూసుకోబోతున్నాడు. ‘ప్రేమమ్’ లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీ తర్వాత వీరు ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ఎంచుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.