నిర్మాతగా ఎమ్మెస్ రాజు సాధించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే. ‘డర్టీ హరి’ ‘మళ్లీ పెళ్లి’ వంటి చిత్రాలతో దర్శకుడిగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ ‘అగధ’తో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బుధవారం ‘అగధ’ చిత్ర ప్రమోషన్స్‌కు శ్రీకారం చుడుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఓ చీకటి గుహలో 12 చేతులతో కూడిన ఓ భారీ విగ్రహం, దాని ముందు విభిన్న వేషధారణలో ఓ అమ్మాయి…విగ్రహం తాలూకు ముఖంలో మిస్టిక్ ఫీల్‌తో పోస్టర్ ఆసక్తినిరేకెత్తించేలా ఉంది. 85 రోజుల్లో విభిన్న లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేశామని, 45 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ హైలైట్‌గా నిలుస్తాయని, నటీనటుల వివరాలతో పాటు విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని దర్శకుడు ఎమ్మెస్ రాజు అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, సంగీతం: మిక్కిన్ అరుల్ దేవ్, నిర్మాత: విశాలాక్షి బలుసు, రచన-దర్శకత్వం: ఎమ్మెస్ రాజు.