NETFLIX | 1999 నాటి కాందహార్ హైజాక్ ఉదంతం నేపథ్యంలో రూపొందించిన ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ వివాదాల్లో చిక్కుకుంది. ఈ సిరీస్‌లో ఉగ్రవాదుల పేర్లను మార్చి చూపించారని, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా ఉద్దేశ్యపూర్వకంగా దర్శకనిర్మాతలు వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వివాదాస్పద అంశాలపై వివరణ ఇవ్వాలని నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ కేంద్ర అధికారుల ముందు హాజరయ్యారు. ఇక నుంచి కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని, సమీక్షలు చేపడతామని ఆమె కేంద్రానికి హామీ ఇచ్చారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గంట పాటు జరిగిన ఈ సమావేశంలో తీవ్రవాదుల పేర్లను మార్చి చూపించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
భవిష్యత్తులో దేశ ప్రజల మనోభావాలను గౌరవించేలా కంటెంట్‌ను ప్రసారం చేస్తామని, చిన్నారులకు సంబంధించిన కంటెంట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటామని నెట్‌ఫ్లిక్స్ కేంద్రానికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.