iBomma Shutdown | తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర నష్టాన్ని కలిగించిన పైరసీ వెబ్సైట్లు ఐబొమ్మ (iBomma), బప్పం టీవీ (Bapam TV) లను సైబర్ క్రైమ్ పోలీసులు అధికారికంగా మూసివేయించారు. ఈ వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని శనివారం అరెస్టు చేసిన పోలీసులు అతనితోనే ఆయా వెబ్సైట్ల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయించినట్లు సమాచారం.
గతంలో ‘నా వద్ద కోట్ల మంది డేటా ఉంది. ఈ వెబ్‌సైట్‌పై దృష్టి సారించడం ఆపండి’ అంటూ ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ విసిరినట్లు సోషల్ మీడియాలో ఒక లేఖ సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆ సవాలును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు, రవి అరెస్ట్ తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రవి నుంచి వెబ్ లాగిన్లు, సర్వర్ వివరాలను సేకరించి, అతడి సమక్షంలోనే ఆ పైరసీ వేదికలను శాశ్వతంగా క్లోజ్ చేయించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నిందితుడు ఇమ్మడి రవి నుంచి స్వాధీనం చేసుకున్న వందల సంఖ్యలో ఉన్న హార్డ్ డిస్క్‌లను పోలీసులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. అలాగే, అతని బ్యాంక్ ఖాతాల ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ పైరసీ సామ్రాజ్యం వెనుక ఉన్న వ్యక్తులు, ఆర్థిక వనరులపై లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు ఇమ్మడి రవిని తమ కస్టడీకి తీసుకుని మరింత కీలక సమాచారం రాబట్టాలని పోలీసులు నిర్ణయించారు. దీనిలో భాగంగా సోమవారం నాడు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేయనున్నారు.