Pawan Kalyan | నేను ఇష్టంతో సినిమాలు చేయడం లేదు.. పార్టీని నడపడానికి సినిమాలు చేస్తున్నానని సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడిలో వారాహి యాత్ర (Varahi Yatra) కొనసాగుతోంది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 151 సీట్లున్న వైఎస్సార్సీపీ మనల్ని టార్గెట్ చేస్తుందంటే జనసేన ఎంత బలమైందో అర్థమవుతోంది. మన దగ్గర అన్యాక్రాంతంగా వచ్చిన ఆస్తులు లేవు. మనమేదైనా మాట్లాడటానికి అధికారంలో లేం. నువ్వు విడిగా రా.. అని అంటారు. ఒంటరిగా వస్తానో.. కలిసే వస్తానో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో వ్యూహంతోనే ముందుకెళ్తాం. నేను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెడుతా. సీఎం పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తా. రెండు చోట్లా నిలబడటం నాకిష్టం లేదు. గతంలో నన్ను ఓడించడానికి గట్టి ప్రయత్నం చేశారు. ఈ సారి ఎలా ఆపుతారో చూస్తానన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉండడు.. పారిపోతాడనుకున్నారు. కానీ మంగళగిరిలో పార్టీ ఆఫీస్ పెట్టుకుని పోరాడుతున్నా. మేం చేగువేరాను స్పూర్తిగా తీసుకున్నామన్నారు.
మన వనరులు దోచుకుని, మన రోడ్లు నాశనం చేసి, మన పర్యావరణాన్ని బీభత్సం చేసి.. సంక్షేమ పథకాలు అని చెప్పి 5 రూపాయలో, పది రూపాయలో పడేస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లినప్పుడు గజేంద్రసింగ్ షెకావత్‌తో పోలవరం గురించి మాట్లాడాను. పోలవరం అనేది వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఏటీఎం మెషిన్లా తయారైంది. ఎన్ని చట్టాలు తెచ్చినా చిత్తశుద్ది లేని నాయకులున్నప్పుడు ఏ పనీ అవదు. నేను నిజాయితీగా నిలబడే వ్యక్తిని. మమ్మల్ని నమ్మండి. మమ్మల్ని గుర్తించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు.