“విక్రమార్కుడు’ చిత్రంలో టిట్లా పాత్రలో నేను పండించిన విలనీ అందరికి గుర్తుండిపోయింది. ఆ తర్వాత ఆ స్థాయి క్యారెక్టర్ రాలేదు. ఇప్పుడా లోటుని ‘పొట్టేల్’ సినిమా తీర్చింది’ అన్నారు అజయ్. యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా సాహిత్ మోత్కూర్ దర్శకత్వం వహించిన ‘పొట్టేల్’ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నటుడు అజయ్ మాట్లాడుతూ ‘ తెలంగాణ నేపథ్యంలో 1980 దశకంలో కథ నడుస్తుంది.
అప్పటి గ్రామీణ తెలంగాణలోని మూఢనమ్మకాలు, సెంటిమెంట్స్.. ఈ క్రమంలో పండే డ్రామా ఉద్వేగాన్ని పంచుంది. అంతర్లీనంగా చదువు అవశ్యకత గురించి చర్చిస్తుంది’ అన్నారు. తాను ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్‌లోనే ఉండటం వల్ల తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పడం అంత కష్టమేమీ కాలేదని అజయ్ తెలిపారు.
పటేల్ క్యారెక్టర్ కోసం చేసిన హోమ్‌వర్క్ గురించి చెబుతూ ‘తెలంగాణలో సిగం (పూనకం) వచ్చిన వాళ్లు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. సినిమాలోని ఆ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టాను. దేవుడి వేడుకల్లో పూనకం వచ్చే వాళ్లను కలిసి కొన్ని విషయాలు తెలుసుకున్నా’ అన్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెబుతూ “పుష్ప-2’లో మంచి పాత్ర చేస్తున్నా. అజయ్‌దేవ్‌గణ్ ‘సింగం ఎగైన్’లో నటిస్తున్నా. తమిళం, మలయాళంలో కొన్ని సినిమాలను అంగీకరించా’ అన్నారు.