‘నేను మెగా ఫ్యామిలీ అభిమానిని. ఆ కుటుంబానికి దగ్గరగా ఉండాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. తర్వాత పీఆర్ఓగా కెరీర్ స్టార్ట్ చేశా. మారుతీ ప్రోద్బలంతో ‘ఈరోజుల్లో’ సినిమాతో నిర్మాతనయ్యాను. ఆ సినిమా సక్సెస్‌తో నిర్మాతగా నా కెరీర్ మొదలైంది.’ అంటూ గుర్తు చేసుకున్నారు నిర్మాత ఎస్కేఎన్. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఆయన నిర్మించిన ‘బేబీ’ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం హీరోగా ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమాను నిర్మిస్తున్నారాయన. అలాగే తన ‘బేబీ’ చిత్రాన్ని కూడా హిందీలో నిర్మిస్తున్నారు ఎస్కేఎన్. నేడు (జూలై 7) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఎస్కేఎన్ విలేకరులతో ముచ్చటించారు. ‘ఒక జర్నలిస్ట్‌గా, పీఆర్ఓగా, నిర్మాతగా నా కెరీర్‌లోని ప్రతి దశనూ ఎంజాయ్ చేశాను. ఏ పనినైనా ఉత్సాహంగా చేయడం నాకు అలవాటు. నేను ఈ రోజు యూవీ క్రియేషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గీతా ఆర్ట్స్ సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నానంటే కారణం అల్లు అరవింద్‌గారు. ఆయనిచ్చిన స్వేచ్ఛా, ప్రోత్సాహమే నన్ను ఇంతటి వాడ్ని చేసింది.
అలాగే బన్నీవాసు నాకు మార్గదర్శి. కథ, సంగీతం, ఎడిటింగ్ ఇత్యాది శాఖలపై ఆయన జడ్జిమెంట్ అద్భుతంగా ఉంటుంది. అవన్నీ బన్నీ వాసుని చూసి నేర్చుకుంటూ ఉంటా.’ అని తెలిపారు ఎస్కేఎన్. ప్రేక్షకుల్ని మెప్పించే ఒకేఒక అంశం కంటెంట్ అని, అందుకే కంటెంట్ బాగున్న కథల్నే సెలక్ట్ చేసుకుంటున్నామని, ప్రస్తుతం తమ నిర్మాణంలో ఉన్న సినిమాలన్నీ స్ట్రాంగ్ కంటెంట్‌తో ఉన్నవేనని ఎస్కేఎన్ తెలిపారు. ‘ది రాజాసాబ్’ గురించి చెబుతూ ‘గ్లోబల్‌గా ప్రభాస్‌కు ఉన్న ఇమేజ్‌కి తగ్గట్టుగానే ‘ది రాజాసాబ్’ ఉంటుంది. ఆయన్ను ఎలాగైతే చూడాలని అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారో ‘ది రాజాసాబ్’లో అలా కనిపిస్తారాయన. ప్రస్తుతం బ్యాలెన్స్ షూట్ జరుగుతున్నది. డిసెంబర్ 5న థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది.’ అని చెప్పారు. ‘హిందీ ‘బేబీ’ చిత్రం షూటింగ్ వచ్చే నెల మొదలవుతుంది. ‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. త్వరలో కృష్ణ అనే ఓ ప్రతిభ గల దర్శకుడ్ని పరిచయం చేస్తున్నాం. ఒక ఫేమ్ ఉన్న హీరోయిన్‌తోపాటు ఇద్దరు యంగ్ హీరోలు ఈ మూవీలో ఉంటారు. ఇవిగాక ఇంకా కొన్ని ప్రాజెక్ట్‌లు పైప్ లైన్లో ఉన్నాయి. అలాగే నాకు లైఫ్ ఇచ్చిన మారుతీతో ఒక సినిమా, సాయిరాజేష్‌తో మరో సినిమా కూడా చేయబోతున్నా. ఆహా ఓటీటీలో ‘త్రీరోజెస్ సీజన్ 2’ సిరీస్ స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నది.’ అంటూ తన ప్రాజెక్టుల వివరాలు తెలిపారు ఎస్కేఎన్.