Director Jayashankar | ఒక సినిమా వెనుక దర్శకుడి కృషి, త్యాగం ఎంత ఉందో చెప్పడానికి ‘అరి’ చిత్రం ఒక ఉదాహరణగా నిలువబోతుంది. ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఈ చిత్ర దర్శకుడు జయశంకర్ తన జీవితంలో అత్యంత కీలకమైన ఇద్దరు వ్యక్తులను కోల్పోయారు. ఈ విషాద భారాన్ని మోస్తూనే అక్టోబర్ 10న విడుదల కానున్న ఈ సినిమాను ఆయన పూర్తి చేశారు. ‘అరిషడ్వర్గాలు’ అనే అరుదైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ కథ కోసం జయశంకర్ విస్తృతమైన పరిశోధన చేశారు. హిమాలయాలు, ఆధ్యాత్మిక గురువుల ఆశ్రమాల చుట్టూ తిరిగి మూడేళ్లు కథ రాసి నాలుగేళ్లు చిత్రీకరించారు. ఈ నిరంతర కృషిలో ఆయనకు వెన్నెముకగా నిలిచిన తన తండ్రి వంగ కనకయ్య, బావ కె.వి. రావు మరణించారు. ఈ రెండు బలమైన మూల స్తంభాలను కోల్పోయినప్పటికీ సినిమాను పూర్తి చేయాలనే సంకల్పంతో జయశంకర్ ముందుకు సాగారు.
తన త్యాగానికి, నష్టానికి నిదర్శనంగా ఈ చిత్రాన్ని ఆ ఇద్దరికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన జయశంకర్ పోస్ట్ అందరినీ కదిలించింది. రేపటి నుంచి ‘అరి’ ఇక ఆడియెన్స్ సొంతం… ఈ ప్రయాణంలో నా జీవితంలోని మూల స్తంభాలైన మా తండ్రి గారు, బావ గారు మరణించారు. నేను వారిద్దరినీ కోల్పోయాను. అరి చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్‌పై వారి ఆశీస్సులు ఉంటాయి. ఈ మూవీని నేను ఆ ఇద్దరికీ అంకితం చేస్తున్నాను అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. సినిమా కోసం దర్శకుడు పడిన ఈ కదిలించే పోరాటం, వ్యక్తిగత త్యాగం… ‘అరి’ చిత్రాన్ని కేవలం సినిమాగా కాకుండా, ఒక భావాత్మక జ్ఞాపకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది.