Alia Bhatt | అలియాభట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘జిగ్రా’ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. వాసన్ బాల దర్శకత్వం వహించారు. మంగళవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, రానా, సమంత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అలియాభట్ మాట్లాడుతూ “ఆర్ఆర్ఆర్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులతో అనుబంధం ఏర్పడింది. సమంతకు, నాకు సరిపోయే మంచి కథను త్రివిక్రమ్ తయారుచేస్తే బాగుంటుందనిపిస్తుంది. యాక్షన్, డ్రామా, ఎమోషన్..ఇలా అన్ని అంశాల కలబోతగా ‘జిగ్రా’ సినిమా ఆకట్టుకుంటుంది’ అని చెప్పింది.
తనకు ఇష్టమైన కథానాయికలు అలియా, సమంతా ఇద్దరిని ఒకే వేదికమీద చూడటం ఆనందంగా ఉందని, ‘జిగ్రా’ ట్రైలర్ చూస్తే అలియా ఎంతగా కష్టపడిందో అర్థమవుతున్నదని, సినిమా సూపర్‌హిట్ ఖాయమని త్రివిక్రమ్ పేర్కొన్నారు. సమంత మాట్లాడుతూ ‘అమ్మాయిలు వారి జీవితాలకు వారే హీరోలని చెప్పేందుకు అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు రావాలి. అలియా నటన అంటే నాకు చాలా ఇష్టం. తను ఓ వైపు నటిస్తూనే, సినిమాలు కూడా నిర్మిస్తున్నది. వాసన్ బాల ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. తెలుగు ప్రేక్షకుల ప్రేమవల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’ అని తెలిపింది.