తారల అందానికి మేకప్ కొత్త సొబగుల్ని అద్దుతుంది. తెరపై మరింత ఆకర్షణీయంగా చూపిస్తుంది. మేకప్ లేకుండా కెమెరా ముందుకొచ్చే తారలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. వారిలో సాయిపల్లవి ముందువరుసలో ఉంటుంది. దక్షిణాది సినీరంగంలో ఆమె పంథాయే వేరు. కథల ఎంపిక మొదలుకొని తాను పోషించే పాత్రల వరకు ప్రతీ అంశంలో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తుంది.. అలాగే మేకప్ లేకుండా నటించడం ఆమె ప్రత్యేకతగా చెబుతారు. తొలి చిత్రం ‘ప్రేమమ్’ నుంచి ఈ భామ మేకప్ లేకుండానే సహజమైన అందంతో రాణిస్తున్నది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి సాయిపల్లవి మాట్లాడుతూ ‘పాఠశాల రోజుల్లో నాలో అభద్రతాభావం ఎక్కువగా ఉండేది. ముఖంపై మొటిమల్ని చూస్తే బాధగా అనిపించేది. నా గొంతు కూడా బాగోలేదని అనుకునేదాన్ని. ‘ప్రేమమ్’లో మేకప్ లేకుండా నటించా. ప్రేక్షకుల్ని నన్ను ఎలా స్వీకరిస్తారో అని చాలా భయపడ్డా. మేకప్ లేకున్నా చాలా అందంగా కనిపించానని ప్రశంస లొచ్చాయి. ఆ మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అప్పటి నుంచి మేకప్ లేకుండానే నటిస్తున్నా’ అని చెప్పింది.