Sai Pallavi | అగ్ర కథానాయిక సాయిపల్లవి ప్రతిభాపాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉండే ఆమె తాను పోషించే ప్రతీ పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేస్తుంది. సాయిపల్లవి ఓ సినిమాకు ఒప్పుకుందంటే అందులో మంచి కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. గత ఏడాది ‘అమరన్’తో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ప్రతి ఒక్కరికి కొన్ని భయాలుంటాయని, తాను కూడా వాటికి అతీతురాలిని కాదని చెప్పింది.
పబ్లిక్ ప్లేస్‌లోకి వెళ్లినప్పుడు అందరూ తననే చూస్తున్నారనే భావన వల్ల కాస్త భయంగానూ, బిడియంగానూ ఉంటుందని తెలిపింది. తనను ఎవరైనా అభినందించినా ఏదో తెలియని టెన్షన్ ఫీలైనట్లు అనిపిస్తుందని సాయిపల్లవి పేర్కొంది. అన్నింటికంటే ముఖ్యంగా తన అనుమతి లేకుండా ఎవరైనా ఫొటోలు తీస్తే అస్సలు నచ్చదని, అడిగి తీసుకుంటే బాగుంటుంది కదా అని సలహా ఇచ్చింది. ఒక్కోసారి ఓవర్‌థింకింగ్ వల్ల ఆలోచనలు ఎక్కడికో వెళ్లిపోతాయని, వాటిని నియంత్రించుకోవడానికి నిత్యం ధ్యానం చేస్తున్నానని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ సొగసరి తెలుగులో తండేల్, కుబేర చిత్రాల్లో నటిస్తున్నది. బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తూ రణబీర్‌కపూర్ సరసన ‘రామాయణ’ చిత్రంలో నటిస్తున్నది.