IB Ministry | బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ (Dhurandhar) సినిమాకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B Ministry) కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో వివాదాస్పదంగా మారిన కొన్ని డైలాగులతో పాటు, పదాలను తక్షణమే తొలగించాలని లేదా మ్యూట్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ సినిమాలో తరచుగా వినిపించే ‘బలోచ్’ అనే పదాన్ని మ్యూట్ చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన రెహమాన్ డకైట్ పాత్రను ‘బలోచ్ ప్రజల మెస్సయ్య’గా చిత్రీకరించారు. అలాగే రణ్వీర్ సింగ్ పాత్ర (హంజా) కూడా తాను అదే సామాజిక వర్గానికి చెందినవాడినని చెబుతాడు. ఈ ప్రస్తావనలపై అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో ఈ మార్పు చేసినట్లు సమాచారం.
అలాగే ఈ సినిమాలో సంజయ్ దత్ చెప్పిన ఒక వివాదాస్పద డైలాగ్ (మొసలినైనా నమ్మవచ్చు కానీ, బలోచ్‌ను నమ్మకూడదు) అనే దానిపై బలోచ్ కమ్యూనిటీ ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సదరు డైలాగ్‌ను కూడా సవరించినట్లు తెలుస్తోంది. జనవరి 1 నుంచి థియేటర్లలో పాత వెర్షన్‌కు బదులుగా ఈ సవరించిన కొత్త వెర్షన్ ప్రదర్శించాలని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలకు కేంద్రం ఈమెయిల్ పంపినట్లు తెలుస్తుంది. డిసెంబర్ 5, 2025న విడుదలైన ఈ చిత్రం ఇండియాలో రూ.722 కోట్లు రాబట్టగా.. వరల్డ్ వైడ్‌గా రూ.1100 కోట్ల మైలురాయిని దాటి 2025 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.