Ram Charan | సూపర్‌స్టార్ కొడుకుననే భేషజం ఇసుమంత కూడా కనిపించదు రామ్‌చరణ్‌లో. పాన్ఇండియా హీరో స్థాయికి ఎదిగినా ఇప్పటికీ ఒదిగే వుండటం ఆయన ైస్టెల్. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఇష్టాఇష్టాల గురించి చెప్పుకొచ్చారు రామ్‌చరణ్. తన సినిమాల్లో తనకు నచ్చిన సినిమా ఏంటి? అనడిగితే తడుముకోకుండా ఆరంజ్, రంగస్థలం సినిమాల పేర్లు చెప్పేశారు రామ్‌చరణ్. ‘మగధీర’ గురించి ప్రస్తావిస్తే.. ‘అది నా అభిమానులకు ఇష్టమైన సినిమా. నా కెరీర్‌ని నిలబెట్టిన సినిమా కూడా’.. అని సమాధానమిచ్చారు చరణ్. అంతేకాదు, తనకు సినిమాల్లో యాక్షన్ సినిమాలంటే ఇష్టమని, దుస్తుల్లో సంప్రదాయ దుస్తులకే ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఇష్టమైన హీరోహీరోయిన్లు? అనడిగితే..
తమిళ హీరో సూర్య, సమంత అని సూటిగా బదులిచ్చారు. ఇక తన జీవితంలో మరచిపోలేని ఫ్యాన్ మూమెంట్ గురించి చెబుతూ ‘ఇండియాలో నాకు చాలామంది అభిమానులున్నారు. వాళ్లు నాపై అభిమానం చూపించడం కామన్. అయితే.. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌కి జపాన్ వెళ్లాం. అక్కడ ఓ 70ఏళ్ల వృద్ధురాలు నాకు 180 పేజీల పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చింది. అది ఓపెన్‌చేసి చూస్తే. అందులో నేను చేసిన పాత్రలు, చిత్రాలకు సంబంధించిన బొమ్మలు ఉన్నాయి. వాటిని ఆమె స్వయంగా గీశారట. నిజంగా ఆశ్చర్యపోయాను. ఆమెది నా భాష కాదు, నా దేశం కాదు. కానీ అభిమానంతో నా బొమ్మలు గీశారు. జీవితంలో మరిచిపోలేని సంఘటన అది.’ అంటూ గుర్తుచేసుకున్నారు రామ్‌చరణ్.