‘అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ చరిత్ర సృష్టించి, మరణానంతరం కూడా జనహృదయాల్లో బ్రతికుండే మహనీయులకే జయంతులు జరుగుతాయి. నా దృష్టిలో ఎన్టీఆర్ లాంటి మహపురుషులకు జరిగేది మాత్రమే జయంతి.’ అన్నారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. నేడు(మే 28) సంయుక్తాంధ్ర మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు, పద్మశ్రీ నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకొని ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘కళారంగంలోనే కాక, రాజకీయరంగంలో కూడా ఎందరికో ఎన్టీఆర్ స్ఫూర్తిప్రదాత. ఆయన స్ఫూర్తితోనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. అందుకే.. ఆయన చిత్రపటంతోనే నా బొమ్మరిల్లు సంస్థ లోగోను రూపొందించాను. ఈ అరుదైన ఫొటో వెనుక ఓ కథ ఉంది. ఇది అన్నగారి ‘రక్తసంబంధం’ సినిమాలోని ‘చందురుని మించు అందమొలికించు..’ పాటలో స్టిల్.
ఆ పాటలో కూడా రెండుమూడు షాట్స్‌లో మాత్రమే ఈ ఫొటో కనిపిస్తుంది. ఆ సినిమా అనంతరం నిర్మాతలు డూండీ, సుందర్‌లాల్ నెహతా ఆ చిత్రపటాన్ని ఎనీఆర్కి బహూకరించారట. దాన్ని నేను హరికృష్ణగారి ఇంట్లో చూశాను. ఆయన్ని రిక్వెస్ట్ చేసి, ఆ చిత్రపటాన్ని నా బొమ్మరిల్లు లోగోకి పెట్టుకున్నాను. కీరవాణిగారు, తను పూజించే జీసెస్ కోసం రాసుకుని, స్వరపరిచిన ‘నా పరిపూర్ణ పరిశుద్ధ’ గీతాన్ని నా బేనర్ సాంగ్‌కి అడిగాను. ఆయన కూడా రామారావుగారి అభిమాని కావడంతో ఆనందంగా ఇచ్చారు.’ అని తెలిపారు వైవీఎస్. ఇంకా చెబుతూ ‘తెలుగు భాషకు పట్టాభిషేకం చేసిన తెలుగుతేజం ఎన్టీఆర్. రక్తబంధాలకు అతీతంగా తెలుగువారందరికీ ఆయన అన్నగా నిలిచారు. ‘అన్న’ అనే బంధానికి శాశ్వత నిర్వచనాన్నిచ్చారు. తెలుగుజాతి ఉన్నంతవరకూ ఎన్టీయార్ చిరస్మరణీయుడే’ అంటూ కొనియాడారు వైవీఎస్ చౌదరి.