Pushpa Pre Release Event – Hyderabad Traffic Alert | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్ మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకుండానే పలు రికార్డులను ఈజీగా బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే ప్రీ సేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, అందులో ఈ మూవీ టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. అయితే ఈ మూవీ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ దగ్గర పడుతుండటంతో ‘పుష్ప2’ టీమ్ తమ ప్రమోషనల్ ఈవెంట్స్‌ను ఫాస్ట్‌గా చేస్తోంది. ఇప్పటికే ముంబయి, కొచ్చి అభిమానులను పలకరించిన మూవీ టీమ్, సోమవారం హైదరాబాద్‌లో ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది.
యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకను నిర్వహించనుండగా.. ఈ వేడుకకు అభిమానులు భారీ ఎత్తున రానుండడంతో భద్రత దృష్ట్యా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు సాయంత్రం నాలుగు గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు మొదలవుతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రకటించారు. దాదాపు ఎనిమిది వేల మందికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పాస్‌లు జారీ చేయడంతో 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. అలాగే వాహనాలు పార్కింగ్ కోసం మూడు చోట్ల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ట్రాఫిక్ ఆంక్షలు నేపథ్యంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి వెళ్లే వాహనాలను కృష్ణానగర్ జంక్షన్ మీదుగా పంజాగుట్ట వైపు మళ్లించనున్నారు. అలాగే మైత్రివనం మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. అలాగే మైత్రివనం నుంచి బోరబండ వెళ్లే వాహనాలు కృష్ణకాంత్ పార్క్ మీద మోతి నగర్ వైపు మళ్లిస్తారు. ప్రతీ ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు తెలిపారు.