గత కొద్ది కాలంగా బాలీవుడ్లో బయోపిక్ ట్రెండ్ కొనసాగుతున్నది. ఇందులో ఎక్కువగా దిగ్గజ క్రీడాకారుల జీవిత కథా చిత్రాలు తెరకెక్కగా..ఇప్పుడు పేరున్న చెఫ్‌ల బయోపిక్స్ మొదలయ్యాయి. ఇప్పటికే వంటలరాణిగా పేరున్న తార్లా దలాల్ బయోపిక్ చిత్రీకరణలో ఉంది. ‘తార్లా’ టైటిల్‌తో తెరకెకుతున్న ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రలో నటిస్తున్నది.
ఈ చిత్రాన్ని ఆర్ఎస్ వీపీ బ్యానర్లో రోనీ స్రూవాలా, ఐశ్వినీ ఐయ్యర్ తివారీ, నితీష్ తివారీ నిర్మిస్తున్నారు. పీయూష్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తాజాగా మరో పేరున్న వంటకాడు సంజీవ్ కపూర్ జీవిత కథను తెరపైకి తెచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
నిర్మాత హన్సలాల్ మెహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంజీవ్ కపూర్ పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా తేలలేదు. కొందరు ప్రముఖ నటులను ఈ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు బయోపిక్స్ మధ్య పోటీ ఉంటుందనే భావిస్తున్నారు.