National Film Awards | జాతీయ అవార్డులు ప్రకటించడమే ఆలస్యం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలైపోయాయి. అసలు నేషనల్ అవార్డులంటే ఏంటో కూడా తెలియని వారు కూడా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని అనవసరమైన రచ్చ చేస్తున్నారు. అయినా ఇది ఎప్పుడూ ఉండే తతంగమే. ఎందుకంటే అవార్డులనేవి అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచడం ఏ కాలంలోనూ జరుగదు. కాబట్టి మరీ ఎక్కువగా రచ్చ చేయడం ఎందుకని చాలా మంది వాదన. అయితే జై భీమ్ అనే తమిళ సినిమాకు అవార్డు రాకపోవడంపై అందరిలోనూ కొంత నిరాశ ఉంది. అంతమంచి సినిమాను జ్యూరీ గుర్తించకపోవడంపై తమిళ తంబీలతో పాటు చాలా మంది సినీ ప్రేమికులు బాధ పడ్డారు.
కాగా ఈ సినిమాకు అవార్డు రాకపోవడంపై నాని కూడా కాస్త నిరాశ చెందాడు. ఈ మేరకు ఇన్‌స్టాలో జైభీమ్ అని ఓ హార్ట్ బ్రేక్ సింబల్‌ను పెట్టాడు. అలా పెట్టాడో లేదో నానిపై విమర్శల దాడి జరుగుతుంది. ఎవరు పడితే వాళ్లు నాని తెలుగు సినిమాను అవమానిస్తున్నాడంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మనకు వచ్చినందుకు గర్వపడకుండా తమిళ సినిమాకు రాలేదని బాధ పడటం ఏమిటని కొందరు నెటిజెన్లు అదే పనిగా పెట్టుకుని ట్రోల్స్ చేస్తున్నారు. ఇందులో అంతలా ఫీలయ్యే విషయం ఏమిటనేది కొందరి ప్రశ్న. మాములుగా తెలుగు ప్రేక్షకులు సినిమా ప్రియులన్నది ఎందరో మహామహులే అన్న మాటలు. తెలుగు వాళ్లకు సినిమా నచ్చితే భాష ఏంటనేది కూడా ఆలోచించకుండా నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు.
నాని సైతం దానికి మినహాయింపు కాదు. అంత గొప్ప సినిమాకు నేషనల్ అవార్డు రాలేదని కాస్త నిరాశ చెందాడు. దాన్ని కొందరూ భూతద్దంలా చూస్తే అర్థమే లేదు. మరికొందరైతే నాని గతంలో కొన్ని ఆడియో ఫంక్షన్లలో మాట్లాడిన మాటలను వెతికి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా హీరో అంటే దుల్కర్ అని ఇలా గతంలో నాని చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి మరీ నెగెటీవిటి ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నాని ఈ స్థాయికి వచ్చాడంటే దాని వెనకాల ఎంతో కృషి పట్టుదల ఉంది. అలాంటి వ్యక్తిపై ఇలా విమర్శలు చేయడం సరికాదని కొందరు నెటిజన్లు తెలుపుతున్నారు. మరి ఈ రచ్చ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.