Nandamuri Balakrishna | బాలయ్య కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే ‘నరసింహనాయుడు’ తర్వాత దాదాపు పదేళ్ల వరకు ఆయనకు సరైనా హిట్ లేదు. బోయపాటి కలయికలో వచ్చిన ‘సింహా’ వరకు బాలకృష్ణకు చెప్పుకోదగ్గ హిట్ లేదు. మధ్యలో ‘లక్ష్మీ నరసింహా’ పర్వాలేదనిపించినా కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేకపోయింది. ఇక ఆ సమయంలో బాలయ్య పనైపోయింది. దుకాణం సర్దుకోవాల్సిన టైమ్ వచ్చింది అని ఎన్నో విమర్శలు ఎదుర్కున్నాడు. కానీ ‘సింహా’తో అందరి నోళ్ళకు తాళం వేశాడు. విమర్శించిన వారే సింహా సినిమాలో బాలయ్యను చూసి ఈలలు వేశారు. ఇక ఆ తర్వాత ఏడాది ‘శ్రీరామ రాజ్యం’తో మరో హిట్ కొట్టాడు. ఇక ‘లెజెండ్’తో తిరుగులేని విజయాన్ని, మార్కెట్‌ను సొంతం చేసుకున్నాడు.
కుర్ర హీరోలకే లేని 50కోట్ల మార్కును బాలయ్య లెజెండ్ సినిమాతో అవలీలగా కొట్టేశాడు. ఇక బాలయ్యకు తిరుగులేదు అనుకుంటున్న టైమ్‌లో మళ్ళీ రెండు ఫ్లాపులు చేరాయి. అయితే ఆ రెండు ఫ్లాపుల ప్రభావం బాలయ్య మార్కెట్‌పై ఏమాత్రం పడలేదు. ఆ తర్వాత వచ్చిన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ కోట్లు కొల్లగొట్టి బాలయ్య రేంజ్‌ను అమాంతం పెంచింది. నటుడిగా మరో స్థాయిలో నిలబెట్టింది. ఈ సినిమా తర్వాత బాలయ్యపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్లో పెరిగాయి. మళ్లీ పాత బాలయ్య వచ్చేశాడు అనుకున్నారు.
కానీ ఈ సినిమా తర్వాత వరుసగా ఐదు డిజాస్టర్లు పడ్డాడు. అప్పటివరకు కాస్తో కూస్తో యంగ్ హీరోలకు పోటీగా మార్కెట్ క్రియేట్ చేసుకున్నా.. డిజాస్టర్ల దెబ్బకు బాలయ్య మార్కెట్ కుప్పకూలిపోయింది. ఇక బోయపాటి సైతం ఈ సారి బాలయ్యను కాపడలేడు అని అందరూ తీర్మానించేశారు. కట్ చేస్తే బాలయ్య కెరీర్లోనే ‘అఖండ’ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా సరికొత్త రికార్డులు నెలకొంది. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘వీరసింహా రెడ్డి’ సైతం డివైడ్‌టాక్‌తో సంక్రాంతి విన్నర్లో ఒకటిగా నిలిచింది.
అఖండకు ముందు బాలయ్యకు రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల మేర మార్కెట్ ఉండేది. కానీ అఖండ, వీరసింహా వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో బాలయ్య మార్కెట్ డబుల్ అయింది. కెరీర్ తుది దశకు వస్తుందన్న సమయంలో బాలయ్య రేంజ్ ఇలా పెరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం బాలయ్య అనీల్ రావిపూడితో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. ఒక్క ఓటీటీ రైట్స్‌కే అమెజాన్ రూ.36 కోట్లు చెల్లించిందని సమాచారం.
కేవలం ఓటీటీ రైట్స్‌కే ఈ రేంజ్లో బిజినెస్ జరిగితే.. థియేట్రికల్ బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతుందో అని ప్రేక్షకులు అంచనా వేసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎంత లేదన్న ఈ సినిమాకు ఓవరాల్‌గా వంద కోట్ల బిజినెస్ జరగడం ఖాయంగానే కనిపిస్తుంది. దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో శ్రీలీల కీలకపాత్ర పోషిస్తుంది. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. షైన్ స్క్రీన్ ప్రతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు.