Krrish-4 Movie On cards | ఇప్పుడంటే ఏడాదికో సూపర్ హీరో సినిమా పుట్టుకొస్తుంది కానీ, అప్పట్లో సూపర్ హీరో సినిమా అంటే క్రిష్ మాత్రమే. సరిగ్గా 20ఏళ్ల క్రితం’ కోయి మిల్గయా’ సినిమాతో క్రిష్ ఫ్రాంచైజీ మొదలైంది. రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటించాడు. క్రిష్ ఫ్రాంచైజీలో మొదటి భాగంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లో సంచలనమే సృష్టించింది. అలాంటి కాన్సెప్ట్‌తో హాలీవుడ్లో మాత్రమే సినిమాలు తెరకెక్కాయి. తొలిసారి ఇండియన్ సినిమాకు రాకేష్ రోషన్ సూపర్ హీరోని పరిచయం చేశాడు. ఇక మూడేళ్ల తర్వాత సెకండ్ పార్ట్ క్రిష్ పేరుతో రిలీజైంది.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. దాదాపు రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.120 కోట్లు కలెక్ట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ వేరే లెవల్. మళ్లీ ఏడేళ్ల తర్వాత క్రిష్ ప్రాంచైజీలో మూడో పార్టు రిలీజైంది. ఇది కూడా సంచలన విజయం సాధించింది. రివార్డులతో పాటు ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ.400 కోట్ల కలెక్షన్లు సాధించి తిరుగులేని విజయం సాధించింది. ఇక దీనికి కొనసాగింపుగా నాలుగో పార్టు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని హృతిక్ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
కాగా తాజాగా క్రిష్-4కు సంబంధించిన బిగ్ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అయితే నాలుగో పార్టును హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ కాకుండా అగ్నిపథ్ ఫేం కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించనున్నాడట. సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి రాకేష్ రోషన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నాడట. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతం హృతిక్ చేతిలో ఫైటర్‌తో పాటు వార్-2 ఉన్నాయి.