Hritik Roshan | బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ మెగాఫోన్ పడుతున్న విషయం తెలిసిందే. తాను హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ క్రిష్ ఫ్రాంచైజీలో భాగంగా నాలుగో పార్ట్‌కు హృతిక్ రోషన్ దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే మొదటిసారి మెగాఫోన్ పట్టబోతున్న సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు హృతిక్.
దర్శకత్వం అంటే నాకు చిన్ననాటి నుంచి ఆసక్తి ఉంది. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. మళ్లీ కొత్తగా స్కూల్లో అడుగుపెట్టినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఇది నాకు పూర్తిగా కొత్త రంగం. దర్శకుడిగా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఎంతో పరిశోధన చేయాలి. కొన్నిసార్లు ‘ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాను?’ అని కూడా అనిపించవచ్చు. అయినా, ఈ సవాళ్లన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా దర్శకుడిగా నా ప్రస్థానం మొదలుపెడుతున్నా. మీ అందరి ప్రేమ, సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోను! అని హృతిక్ రోషన్ వెల్లడించారు.
హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ హీరో చిత్రం క్రిష్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటివరకు హాలీవుడ్ సూపర్ హీరోలు మాత్రమే తెలిసిన ప్రేక్షకులకు ఇండియన్ సూపర్ హీరోగా హృతిక్ రోషన్ అలరించాడు. కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 సినిమాలు రాగా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ఇప్పుడు ఇదే ఫ్రాంచైజీ నుంచి క్రిష్ 4 రాబోతుంది. మొదటి మూడు పార్టులకు హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించగా.. తాజాగా వచ్చే క్రిష్ 4తో హృతిక్ మెగాఫోన్ పట్టబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం.