Hrithik Roshan | బాలీవుడ్ ఐకానిక్ ఫ్రాంచైజీ ‘డాన్’ (Don) గురించి ప్రస్తుతం ఒక సంచలన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫ్రాంచైజీ నుంచి బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్ తప్పుకున్న తర్వాత ‘డాన్ 3’ బాధ్యతలను రణ్వీర్ సింగ్ అందుకుంటారని అందరూ భావించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయినట్లు కనిపిస్తోంది. కొత్త ఏడాదిలో బాలీవుడ్ ఒక కొత్త ‘డాన్’ను చూడబోతోందనే వార్త బి-టౌన్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతేడాది ‘ధురంధర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న రణ్వీర్ సింగ్ అనివార్య కారణాల వల్ల ‘డాన్ 3’ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. డేట్స్ సర్దుబాటు కాకపోవడం లేదా ఇతర ప్రాజెక్టుల ఒత్తిడి వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు రణ్వీర్ స్థానంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
దర్శకుడు ఫర్హాన్ అక్తర్ మరియు నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ఈ పాత్ర కోసం హృతిక్ రోషన్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే హృతిక్‌తో రెండు సినిమాలను (లక్ష్య, జిందగీ నా మిలేగి దొబారా) తెరకెక్కించిన ఫర్హాన్ అక్తర్ తాజాగా హృతిక్‌తో డాన్ 3తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ‘ధూమ్ 2’, ‘వార్’ వంటి సినిమాలతో యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న హృతిక్, డాన్ పాత్రకు కావాల్సిన స్టైల్, గ్రేస్ మరియు ఇంటెన్సిటీని పర్ఫెక్ట్గా పండించగలరని చిత్రబృందం నమ్ముతోంది. ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, హృతిక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ఏడాదిలోనే ఈ మెగా ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని హృతిక్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి దిగ్గజాలు పోషించిన ఈ పాత్రలో హృతిక్ కనిపిస్తే.. అది ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సంచలనమే అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.