స్టార్ హీరో ఎన్టీఆర్ శనివారం తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా..సెలబ్రిటీలు ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపారు. అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా అంటూ తెలుగులో విష్ చేశారు హిందీ స్టార్ హృతిక్ రోషన్. ‘త్వరలోనే యుద్ధభూమిలో మనం కలిసే రోజు కోసం వేచి చూస్తున్నా’ అని ట్వీట్ చేశారు. దీనికి ఎన్టీఆర్ ..‘మీరు బాగా విశ్రాంతి తీసుకుని యుద్ధభూమిలో తలపడేందుకు సిద్ధంకండి. థాంక్యూ’ అంటూ స్పందించారు. హృతిక్‌తో కలిసి ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంలో నటించబోతున్నారు. యష్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి ‘బ్రహ్మాస్త్ర’ ఫేం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్తారని సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ అప్డేట్ కూడా వెల్లడించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్‌ను వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభిస్తామని తాజా ప్రకటనలో చిత్రబృందం తెలిపారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.