దీపికా పదుకొణె, హృతిక్ రోషన్ హీరోహీరోయిన్లుగా బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘ఫైటర్’. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ సినిమా ఇది. గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ నెల 25వ తేదీ గురువారం (నేడు) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా పలు సన్నివేశాల విషయంలో సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ చిత్రబృందానికి మరో ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.
హాట్ సన్నివేశాల కారణంగా భారీగానే సెన్సార్ ఎదుర్కొన్న ‘ఫైటర్’కు విడుదల విషయంలోనూ చుక్కెదురైందని సమాచారం. యూఏఈ మినహా గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై నిషేధం విధించారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఓ మతస్తుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉండటంతో ఆయా దేశాల్లో బ్యాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయమై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.