Vidya Balan | దక్షిణాదికి చెందిన ఓ నిర్మాత విద్యాబాలన్‌ని ఘోరంగా అవమానించాడట. తను అన్న మాటలకు దాదాపు ఆరు నెలలు అద్దంలో ముఖం చూసుకోలేకపోయిందట విద్యాబాలన్. కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఆ చేదు అనుభవాన్ని తన తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నది విద్యాబాలన్. ‘హీరోయిన్గా ఫస్ట్ నేను బుక్ అయిన సినిమా మలయాళ చిత్రం ‘చక్రం’. మోహన్‌లాల్ హీరో అనగానే నాకు ఆనందం ఆగలేదు. స్టార్ హీరో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నానని తెలియగానే, అవకాశాలు పోటెత్తాయి. వరుసగా సినిమాలకు సంతకాలు చేశాను. ఉన్నట్టుండి ‘చక్రం’ మధ్యలోనే ఆగిపోయింది. ఆ విషయం తెలిసి, నా జాతకం మంచిది కాదని మిగతా సినిమాల నుంచి కూడా నన్ను తొలగించేశారు.
మానసికంగా క్రుంగిపోయా. ఇంట్లో మనశ్శాంతి లోపించింది. ప్రతి రోజూ గొడవలే. కొంతకాలానికి తమిళంలో ఆఫర్ వచ్చింది. కొన్ని రోజులు షూట్ చేశా. ఆ చిత్ర నిర్మాతకు ‘చక్రం’ ఆగిపోయిన విషయం తెలిసింది. వెంటనే నా జాతకం చూపించాడు. తన సినిమాకు నేను సెట్ కానని నన్ను తొలగించేశాడు. ఈ విషయం తెలిసి అమ్మానాన్నల్ని వెంటపెట్టుకొని సదరు నిర్మాతను కలిశా. అతను అప్పటివరకూ నాతో తీసిన సన్నివేశాలను చూపిస్తూ.. ‘చూడండి.. ఆ ముఖంలో హీరోయిన్ కళ కొంచెమైనా ఉందా?.. డాన్స్ రాదు.. యాక్టింగ్ రాదు.. ఎందుకు మాకీ తలనొప్పి..’ అనేశాడు. ఆ దెబ్బతో దాదాపు ఆర్నెల్లు అద్దంలో నా ముఖాన్ని నేను చూసుకోలేదు. నాపై నాకే అసహ్యం వేసింది. ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయా. ఆ టైమ్‌లో ప్రదీప్ సర్కార్ నాకు అండగా నిలిచి, యాడ్ ఫిల్మ్స్‌లో అవకాశాలిప్పించారు. నా జీవితంలో మరిచిపోలేని రోజులవి.’ అంటూ చెప్పుకొచ్చింది విద్యాబాలన్.