ఇప్పటివరకూ మాస్ పాత్రలతో మెప్పించిన అగ్ర హీరో ఎన్టీఆర్.. తొలిసారి ఓ సమాంతర చిత్రంలో నటించనున్నట్టు తెలుస్తున్నది. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఆయన కనిపించనున్నారట. ఈ వార్త బాలీవుడ్ మీడియాలో బలంగానే వినిపిస్తున్నది. రెండేళ్ల క్రితం అగ్ర దర్శకుడు రాజమౌళి.. తన సమర్పణలో ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే బహు భాషా చిత్రం రూపొందనున్నదనీ, ఈ సినిమాను వరుణ్ గుప్తాతో కలిసి తన తనయుడు కార్తికేయ నిర్మిస్తారని, నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని తెలిపారు. భారతీయ సినిమా గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా రూపొందే ఈ సినిమాలో ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా’ దాదాసాహెబ్ ఫాల్కే జీవితం చాలా కీలకంగా ఉంటుందట. ఆ పాత్రనే ఎన్టీఆర్ పోషించనున్నారట.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. భారతీయ సినిమా పుట్టుక, ఎదిగిన తీరును ప్రపంచానికి చూపే సినిమా ఇదని, స్క్రిప్ట్ విని ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారని, ఫాల్కే పాత్ర పోషించేందుకు ఆయన ఉత్సాహంగా ఉన్నారని, ఫైనల్ స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యిందని బాలీవుడ్ మీడియా పేర్కొన్నది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటివరకూ నటించిన పాత్రలన్నింటిలో గొప్ప పాత్ర ఇదే అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.