Betting App| గత మూడు నాలుగు రోజులుగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కొందరు సెలబ్రెటీలపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న క్రమంలో వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎవరైన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌తో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తుండటంతో సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేయడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ప్రముఖులకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక విచారణకు హాజరు కావాల్సిందిగా విష్ణుప్రియ, టేస్టీ తేజలకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ వ్యవహారంలో మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు. దీనిని ఎందుకు ఆదాయమార్గంగా ఎంచుకుంటున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో చాలామంది బెట్టింగ్ యాప్‌లను డెవలప్ చేసి, వాటిని ప్రమోట్ చేసేందుకు సెలబ్రిటీలని ఉపయోగించుకుంటున్నారు. సెలబ్రెటీలు కొన్ని గ్రూపులు ఏర్పాటుచేసి ఆ గ్రూప్స్‌లో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఓ వ్యక్తి చేసిన డిపాజిట్‌పై పర్సంటేజీలను ప్రమోట్ చేసిన వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధానం వలన రోజుకి లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు.
అయితే యూట్యూబ్ ఇన్‌ఫ్లూయన్సర్స్, బల్లితెర నటులు తమ వీడియోలు, నటన ద్వారా తక్కువ సంపాదిస్తున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా.. ఎంత ఎక్కువమందిని ఆకర్షించి డిపాజిట్ చెయ్యిస్తే అంత ఎక్కువ కమీషన్ వస్తుంది. కాబట్టి వారు ఈ యాప్స్ ప్రమోషన్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇన్‌ఫ్లూయన్సర్స్ చాలామంది టెలిగ్రామ్‌లో గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు. వాటిలో ఎక్కువ మంది జాయిన్ అయ్యేలా కంటెంట్ అప్లోడ్ చేస్తుంటారు. అనంతరం అదే గ్రూపులో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట యాప్‌లో జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ వస్తుందని, ఆ తర్వాత డిపాజిట్లపై ఇన్సెంటివ్‌తో పాటు లాస్ పేమెంట్‌పై బోనస్ అంటూ బెట్టింగ్ యాప్‌లో రిజిస్ట్రేషన్ అయ్యేలా ఆకర్షించడం జరుగుతుందని అంటున్నారు.