Boys Hostel Trailer | గత రెండేళ్లుగా కన్నడ సినిమాలు అన్ని భాషల సినిమాలను డామినేట్ చేస్తున్నాయి. సొంత కథలను తీయకుండా.. రీమేక్‌లను నమ్ముకుంటారు అంటూ కేజీఎఫ్ ముందు వరకు విమర్శలు పాలైన ఇండస్ట్రీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు తీస్తూ ఔరా అనిపిస్తుంది. కేజీఎఫ్, కాంతార, చార్లీ777, విక్రాంత్ రోణ ఇలా కంటెంట్ కథలతో వచ్చి కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడదే తరహాలో కన్నడనాట సంచలనం సృష్టించిన మరో సినిమా తెలుగులో రిలీజయ్యేందుకు రెడీ అవుతుంది. అదే బాయ్స్ హాస్టల్. చార్లీ ఫేమ్ రక్షిత్ శెట్టి సమర్పించిన ఈ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. ఈయనకిది తొలి సినిమా. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజైంది.
ట్రైలర్‌ను చాలా తెలివిగా కాన్సెప్ట్ ఏంటో చెప్పి చెప్పనట్లుగా కట్ చేశారు. అనుకోకుండా హాస్టల్ వార్డన్ చనిపోవడం.. ఆ చావుకు కారణం హాస్టల్లో ఉండే ఓ గ్యాంగ్ అని చూపించడం.. దాంతో పానిక్ అయిన ఆ గ్యాంగ్ ఓ సీనియర్ హెల్ప్ తీసుకుని ఆ శవాన్ని యాక్సిడెంట్ అని క్రియేట్ చేయడం ఇలా క్రైమ్ చుట్టూ కథ తిరుగుతుందని ట్రైలర్ చూపించారు. మాములుగా బాయ్స్ హాస్టల్ అంటే ఎలాంటి రచ్చ ఉంటుందో ఈ సినిమాలో కూడా అదే ఉంటుందని స్పష్టం అయింది. దానిని చాలా హ్యూమరస్ వేలో దర్శకుడు ఈ సినిమాను చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఓ వైపు శవంతో క్రైమ్‌ను మరోవైపు అదే శవం చుట్టూ కామెడీను భలేగా దర్శకుడు స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు.
ముఖ్యంగా ఈ సినిమాలో యాంకర్ రష్మీ ఉండటం అందరకీ షాక్‌ను గురి చేసింది. తెలుగు వెర్షన్ కోసం స్పెషల్‌గా ఆమె పాత్రను క్రియేట్ చేశారు. ఇక ట్రైలర్ చివర్లో దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను కూడా చూపించారు. ఇలా కన్నడ సినిమాలో ఇద్దరు తెలుగు వాళ్లను తీసుకోవడం.. అందులోనూ అందరికి తెలిసిన మోహాలను పెట్టడం ఈ సినిమాకు ఇక్కడ కలిసొచ్చే అంశమే. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడీయోస్‌తో కలిసి ఛాయ్ బిస్కెట్ వాళ్లు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.