OTT | గతేడాది చివర్లో థియేటర్లలో విడుదలై ఊహించని విజయాన్ని అందుకున్న తెలుగు హారర్ థ్రిల్లర్ ‘శంబాల’ ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయి ప్రభావాన్ని చూపిస్తోంది. ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఎలాంటి భారీ ప్రచారం లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, డిజిటల్ ప్రేక్షకులను కూడా భయంతో పాటు ఆసక్తికి కట్టిపడేస్తోంది. థియేటర్లలో సక్సెస్ సాధించిన తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టిన ‘శంబాల’ అక్కడ కూడా అరుదైన మైలురాయిని చేరుకుంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన కేవలం ఐదు రోజుల్లోనే ఈ చిత్రం 50 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ పూర్తి చేసింది.
ఈ విషయాన్ని ఆహా వీడియో అధికారికంగా ప్రకటించడంతో సినిమా క్రేజ్ మరోసారి చర్చనీయాంశమైంది.
“భయపెట్టే కథ… ఊపిరి ఆపేసే అనుభవం… శంబాలను కేవలం ఆహాలోనే చూడండి” అంటూ ఓటీటీ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అంశం డిజిటల్ హక్కుల డీల్. ‘శంబాల’ డిజిటల్ రైట్స్‌ను ఆహా వీడియో సుమారు రూ.10 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది ఆది సాయికుమార్ కెరీర్లోనే అత్యధిక విలువకు అమ్ముడైన చిత్రంగా నిలిచింది. దీంతో థియేట్రికల్ రన్‌కు ముందే నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఒక అజ్ఞాత శక్తి ఆకాశం నుంచి భూమిపైకి వచ్చి ఓ గ్రామాన్ని తన నియంత్రణలోకి తీసుకుంటుంది. గ్రామస్తుల శరీరాల్లోకి ప్రవేశించి భయంకర పరిణామాలకు కారణమయ్యే ఆ శక్తి వెనుక అసలు నిజం ఏమిటి? దాన్ని ఎదుర్కొనేందుకు ఒక శాస్త్రవేత్త చేసే ప్రయత్నాలే కథగా సాగుతుంది. మిస్టరీ, హారర్, థ్రిల్లర్ అంశాలను సమపాళ్లలో మేళవించడం ఈ సినిమాకు ప్రధాన బలం. ఈ చిత్రంలో అర్చన అయ్యర్ హీరోయిన్గా నటించగా, స్వాసిక విజయన్, మధు నందన్, ఇంద్రనీల్, రవివర్మ, మీసాల లక్ష్మణ్, షిజు మీనన్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ఉత్కంఠను జోడించింది. హారర్ జానర్‌కు మిస్టరీని బలంగా జోడిస్తే ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో ‘శంబాల’ మరోసారి నిరూపించింది. భయాన్ని కలిగించే సన్నివేశాలు, ఇంటర్వెల్ ముందు వచ్చే హై పాయింట్, చివరి వరకు ఆసక్తిని నిలబెట్టే కథనం సినిమాకు ప్లస్ అయ్యాయి.