Honey Rose | హనీరోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో చేసింది రెండు మూడు సినిమాలే అయినా.. ఈ యలయాళీ బ్యూటీకి భారీగానే ఫాలోయింగ్ ఉంది. చివరగా తెలుగులో బాలకృష్ణ నటించిన వీరనరసింహారెడ్డి చిత్రంలో హీరోయిన్గా నటించింది. ద్విపాత్రాభినయంలో బాలకృష్ణకు జోడీగా కనిపించింది. అయితే, ఈ బ్యూటీ పోలీస్ ఠాణా మెట్లు ఎక్కింది. తనను అసభ్యంగా కామెంట్ చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేశారు. ఫేస్బుక్ వేదికగా తనపై అసభ్యకరంగా కామెంట్ చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనను అవమానిస్తున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో ఆవేదన వ్యక్తం చేసింది.
స్క్రీన్షాట్లతో సహా కొచ్చి సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై సరదాగా వేసే జోక్స్‌ను, మీమ్స్‌ను ఎంజాయ్ చేస్తానని.. వాటికి కూడా ఓ హద్దు ఉంటుందని పేర్కొంది. అభ్యంతరకరంగా కామెంట్ చేస్తే వదిలేదని స్పష్టం చేసింది. అలాంటి కామెంట్స్ చేసిన వారిపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. పోరాటం తన కోసమే కాదని.. మహిళలందరి కోసం తాను ఈ పోరాటం చేస్తున్నానని హనీ రోజ్ పేర్కొంది. ఇక హనీరోజ్‌కు మలయాళ మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ (AMMA) మద్దతు ప్రకటించింది. హనీ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని లేఖ విడుదల చేసింది. హనీరోజ్‌పై చేస్తున్న కామెంట్స్‌ను ఖండించింది. ఇదిలా ఉండగా.. హనీ రోజ్ తెలుగులో బాలకృష్ణ వీర నరసింహారెడ్డి సినిమాలో చేసింది. అంతకు ముందు ఈ వర్షం సాక్షిగా, ఆలయం సినిమాల్లోనూ నటించింది. మలయాళంలో రాచెల్ సినిమాలో నటిస్తున్నది.