జాన్వీకపూర్, ఇషాన్‌కట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ‘హోమ్‌బౌండ్’ చిత్రం విడుదలకు ముందే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రం ‘ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్’ విభాగంలో భారత్ తరపున ఆస్కార్ 2026కు అధికారిక ఎంట్రీ సాధించింది. శుక్రవారం కోల్‌కతాలో జరిగిన సమావేశంలో సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎన్.చంద్ర ఈ వివరాలను వెల్లడించారు. ఆస్కార్ అధికారిక ఎంట్రీ కోసం మొత్తం 24 చిత్రాలు పోటీపడ్డాయని, అవన్నీ గొప్ప కథలేనని ఆయన తెలిపారు.
78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘హోమ్‌బౌండ్’ చిత్రానికి స్టాండింగ్ ఓవేషన్ లభించింది. ఇటీవల టోరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రెండో రన్నరప్‌గా ఇంటర్నేషనల్ పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది. పోలీసు ఉద్యోగం కోసం ఇద్దరు స్నేహితులు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కుల, మత పరంగా వారు ఎదుర్కొనే వివక్ష, వాటికి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో కరణ్‌జోహార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది.