Hrithik Roshan Join Hands with Hombale | కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన హోంబాలే ఫిలిమ్స్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఈ కలయికపై సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
హోంబాలే ఫిలిమ్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, హృతిక్ రోషన్‌కు ఘనంగా స్వాగతం పలికింది. “అతడిని గ్రీక్ గాడ్ అని పిలుస్తారు. అతను హృదయాలను పరిపాలించాడు, పరిమితులను బద్దలు కొట్టాడు. నిజంగానే ఆయన ఒక అద్భుతం! హృతిక్ రోషన్‌ను హోంబాలే కుటుంబానికి స్వాగతించడానికి మేము గర్విస్తున్నాము. ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ కలయిక, ధైర్యం, గొప్పదనం, కీర్తి కథను విప్పబోతోంది. ఇంటెన్సిటీ ఊహలను కలిసే చోట, బిగ్ బ్యాంగ్ ప్రారంభమవుతుంది” అని ఆసక్తికరమైన క్యాప్షన్‌ను పోస్ట్ చేసింది.
హృతిక్ రోషన్ కూడా ఈ భాగస్వామ్యం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. హోంబాలే ఫిలిమ్స్ ఎల్లప్పుడూ ప్రత్యేకమైన కథలకు నిలయమని, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమా అనుభవాన్ని అందించడానికి తాను ఎదురుచూస్తున్నానని తెలిపారు. ప్రస్తుతానికి, ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను నిర్మాణ సంస్థ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.
హృతిక్ రోషన్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు, హోంబాలే ఫిలిమ్స్ కూడా ‘కాంతార: చాప్టర్ 1’, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ‘డ్రాగన్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో బిజీగా ఉంది. ఈ కొత్త ప్రాజెక్ట్ భారతీయ సినిమా పరిశ్రమలో కొత్త సంచలనం సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
A tale of grit, grandeur and glory is set to unfold. #HRITHIKxHOMBALE pic.twitter.com/V4rwkhAP6K
— Hrithik X Hombale (@HRITHIKxHOMBALE) May 29, 2025