బెంగళూరు కేంద్రంగా పనిచేసే హోంబలే ఫిల్మ్స్ అనతికాలంలోనే అగ్రగామి నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఈ బ్యానర్లో రూపొందిన ‘కేజీఎఫ్’ ‘కాంతార’ ‘సలార్’ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందాయి. ‘సలార్’ చిత్రం నుంచి ఈ ప్రొడక్షన్ హౌజ్‌తో అగ్ర హీరో ప్రభాస్‌కు అనుబంధం ఏర్పడింది. ఆయన కథానాయకుడిగా హోంబలే ఫిల్మ్స్ మూడు భారీ ప్రాజెక్ట్‌లు చేపట్టనున్నట్లు గతేడాది ప్రకటన వెలువడింది.
ఈ విషయమై ప్రభాస్ తన తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. హోంబలే ఫిల్మ్స్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. గొప్ప నాణ్యతతో సినిమాలు తీయడంతో పాటు సృజనాత్మక స్వేచ్ఛకు వారు అత్యంత ప్రాధాన్యతనిస్తారని, అందుకే వారి భాగస్వామ్యంలో ఇక ముందు కూడా పనిచేస్తానని ప్రభాస్ చెప్పారు. “కేజీఎఫ్’ షూటింగ్ టైమ్‌లో జరిగిన ఓ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. సినిమా కోసం వేసిన భారీ సెట్ అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. అప్పటికే బడ్జెట్ పరంగా పరిమితులు ఏర్పడటంతో యూనిట్ సభ్యులందరూ టెన్షన్ పడ్డారు.
కానీ నిర్మాత విజయ్ కిరంగదూర్ మాత్రం ‘మీరందరూ ప్రశాంతంగా ఉండండి. డబ్బు అసలు సమస్యే కాదు. సినిమా నాణ్యత విషయంలో మాత్రం రాజీపడొద్దు’ అంటూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావొద్దనే ఆయన ధోరణి నాకు బాగా నచ్చింది. అందుకే హోంబలే ఫిల్మ్స్‌తో వరుస ప్రాజెక్ట్‌లు అంగీకరించా’ అని ప్రభాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో ఆయన ‘సలార్-2’ చేస్తున్నారు. ఇక హోంబలే ఫిల్మ్స్ ‘కాంతార ఛాప్టర్-1’ నిర్మాణంలో బిజీగా ఉంది.