Hollywood | టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, కొత్త టాలెంట్‌కు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ‘దిల్ రాజు డ్రీమ్స్’ పేరుతో ఓ కొత్త ప్రొడక్షన్ హౌజ్‌ని ప్రారంభించారు. ఈ వేడుకను హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రారంభోత్సవానికి యువ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన దేవి శ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, తన సంగీత ప్రయాణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. “ప్రతి ఒక్కరికీ ఫెయిల్యూర్ అనేది తప్పకుండా ఎదురవుతుంది. కానీ క్లాప్ కొడుతున్నప్పుడు, మన ఎనర్జీని అస్సలు తగ్గించకూడదు. నా స్టూడియోలో కూర్చుని ఐదు నిమిషాల్లో ట్యూన్ చేసిన ‘ఊ అంటావా మావ’ పాటను హాలీవుడ్లో ఎవరో కాపీ చేశారు,” అని చెప్పారు.
ఇది నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు కాని ఆనందంగా అనిపించింది. ఒక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఐదు నిమిషాల్లో ట్యూన్ చేసిన పాటను హాలీవుడ్లో కాపీ కొట్టారు అంటే .. అది మన స్థాయిని వాళ్లే నిరూపించారు. ఇప్పుడు వారిపై కేసు వేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నా అని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్లో దేశి శ్రీ పాట కాపీ వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ హాలీవుడ్ చిత్రం ఏది? ఏ పాటలో ఇది జరిగింది? అనే విషయాల్లో ఇంకా స్పష్టత లేదు. దేవి శ్రీ ప్రసాద్ దీని గురించి రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ ఇవ్వొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీత ప్రయాణం గురించి చెప్పాలంటే 20 ఏళ్ల వయసులో ‘దేవి’ సినిమా ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టి, మొదటి సినిమాతోనే తన టాలెంట్‌ను నిరూపించాడు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోకుండా వరుసగా బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ అందిస్తూ, టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ‘పుష్ప’ సినిమా ఆల్బమ్ అతనికి పాన్ ఇండియా స్థాయిలో పేరు తీసుకువచ్చింది. డీఎస్పీ పాటని హాలీవుడ్ కాపీ కొట్టింది అంటే తెలుగు సంగీతానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించినట్టేనని అభిమానులు భావిస్తున్నారు.