‘కేజీఎఫ్’ ఫ్రాంఛైజీ చిత్రాలతో యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది కన్నడ భామ శ్రీనిధి శెట్టి. ఆమె నాని సరసన కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్-3’ మే 1న ప్రేక్షకుల ముందుకురానుంది. శైలేష్ కొలను దర్శకుడు. ఈ సందర్భంగా శనివారం శ్రీనిధి శెట్టి పాత్రికేయులతో ముచ్చటించింది. ‘హిట్-3’లో తాను మృదుల అనే పాత్రలో కనిపిస్తానని, స్వతంత్ర భావాలున్న యువతిగా తన పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని చెప్పింది.
‘సినిమాలో నాని పోషించిన అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎంత ఇంటెన్స్‌గా ఉంటుందో ట్రైలర్లో చూశారు. ఆయన పాత్రకు పూర్తి భిన్నంగా మృదుల కనిపిస్తుంది. అయితే అర్జున్ సర్కార్..మృదుల మాట తప్పితే ఇంకెవరి మాట వినడు. అలా ఎందుకో చేస్తాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే’ అని తెలిపింది.
ఈ సినిమా కోసం తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పానని, అచ్చ తెలుగు అమ్మాయిలా ఎలాంటి ఉచ్చారణ దోషాలు లేకుండా డబ్బింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందని శ్రీనిధి శెట్టి పేర్కొంది. ‘కేజీఎఫ్-3’ గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఈ సినిమాలో నేను నటిస్తున్నానా? లేదా? అనే విషయం ఇప్పుడే చెప్పలేను. కొంతకాలం నిరీక్షించాల్సిందే.
హిందీ ‘రామాయణ’ చిత్రంలో సీత క్యారెక్టర్‌ను నేను తిరస్కరించానని వార్తలొచ్చాయి. అవన్నీ అబద్ధం. అంత గొప్ప పాత్రను రిజెక్ట్ చేసే స్థాయి నాది కాదు. అయితే ఆ సినిమా కోసం ఆడిషన్ మాత్రం ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ల నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. సాయిపల్లవిని సీత పాత్ర కోసం ఎంపిక చేశారు’ అని శ్రీనిధి శెట్టి తెలిపింది.