Bala Krishna | చిత్ర పరిశ్రమతో దశాబ్దాలుగా ఆత్మీయ అనుబంధం కలిగిన ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ గురవారెడ్డి మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారారు. టాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోలతో స్నేహబంధం కొనసాగిస్తున్న ఆయన, తాజాగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌లతో కలిసి గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫోటోలు, భావోద్వేగ పోస్ట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా నిర్మాత మేఘా కృష్ణారెడ్డి నివాసంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేడుకలో ఈ ముగ్గురు దిగ్గజాలు కలుసుకున్నారు. ఆ వేడుకలో భాగంగా డా. గురవారెడ్డి కూడా పాల్గొని, తనకు ఎంతో ప్రియమైన హీరోలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పోస్ట్‌లో చిరంజీవి స్వయంకృషితో ఎదిగిన ప్రతీకగా, నాగార్జున రాజసం కలిగిన స్టార్‌గా, వెంకటేష్ ప్రతి ఇంటి పెద్ద కొడుకులా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన నటుడిగా అభివర్ణించారు. స్టార్డమ్ కంటే ముందుగా వారు సాధారణ మనుషుల్లా కనిపిస్తారని, అదే తనకు వారిపై మరింత గౌరవాన్ని పెంచిందని ఆయన పేర్కొన్నారు.
“వారితో ఉన్నప్పుడు ఆడంబరాల తారలుగా కాకుండా, కళతో మనల్ని ఊయలలూపే సాలీడు జాలంలా అనిపిస్తారు” అంటూ గురవారెడ్డి రాసిన మాటలు ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చివర్లో సరదాగా “నన్ను చూసి ఏదో యాక్టర్ అనుకోకండి… నేను ఎముకల డాక్టర్నే” అంటూ చేసిన కామెంట్ ఈ పోస్ట్‌కు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ, తెలుగు సినిమా అభిమానుల్లో హృదయాన్ని తాకే జ్ఞాపకంగా నిలుస్తోంది.అయితే ఈ పిక్‌లో బాలయ్య మిస్ కావడం కాస్త నిరాశ పరుస్తుంది. సీనియర్ హీరోస్ ఇప్పటికీ అంతే ఫ్ల్రెండ్లీగా ఉంటున్నారు. వీరితో పాటు బాలయ్య కూడా ఉండి ఉంటే ఆ పిక్కి మరింత నిండుదనం వచ్చి ఉండేదని కొందరు చెప్పుకొస్తున్నారు.