Highest grossing Indian movies 2024 | మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలను చూసుకుంటే నాలుగు టాలీవుడ్ సినిమాలు ఈ జాబితాలో నిలిచాయి. సంక్రాంతితో హన్-మాన్ లాంటి బ్లాక్ బస్టర్‌ను అందుకున్న టాలీవుడ్ దేశవ్యాప్తంగా కూడా సత్తా చాటింది. ఆ తర్వాత వచ్చిన కల్కి, దేవర, పుష్ప 2 సినిమాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. అయితే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రాల లిస్ట్ ఒకసారి చూసుకుంటే.!
1. పుష్ప 2 ది రూల్ (రూ.1500 కోట్లు)
Pushpa 2
ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో మొదటి స్థానంలో పుష్ప 2 ది రూల్ చిత్రం నిలిచింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించగా.. సుకుమార్ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాకుండా.. దంగల్, బాహుబలి చిత్రాల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. ఓవరాల్‌గా ఈ చిత్రం రూ.1500 కోట్ల వసుళ్లతో ప్రస్తుతం దూసుకుపోతుంది. ఇదే ఊపు ఈ వారం కూడా ఉంటే బాహుబలి రికార్డు బద్దలవ్వడం ఖాయం అని ప్రేక్షకుల అనుకుంటున్నారు.
2. కల్కి 2898 ఏడీ (రూ.1200 కోట్లు)
Kalki 2898 Ad
ఈ ఏడాది పుష్ప 2 తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో రెండో స్థానంలో నిలిచింది కల్కి 2898 ఏడీ. ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, తదితరులు కీలక పాత్రలో నటించారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మహాభారతం, ఫ్యూచర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌ను అందుకోవడమే కాకుండా.. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో రెండో స్థానంలో నిలిచింది.
3. Stree 2 | ‘స్త్రీ 2’ (రూ.880 కోట్లు)
Stree 2
పుష్ప 2, కల్కి చిత్రాల తర్వాత ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం ‘స్త్రీ 2’(Stree 2). బాలీవుడ్ నటులు రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్, పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. ఐదేళ్ల కిందట బాలీవుడ్లో వచ్చిన ‘స్త్రీ’ (Stree) సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా వచ్చింది. ఇండిపెండెన్స్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.880 కోట్ల వసుళ్లను రాబట్టింది. అయితే ఇందులో రూ.600 కోట్లు కేవలం హిందీ నుంచి రావడమే విశేషం. దీంతో ఫస్ట్ టైం రూ.604 కోట్లు దాటిన హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది.
4. దేవర (రూ.521 కోట్లు)
Devara
పుష్ప 2, కల్కి చిత్రాల తర్వాత ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన మరో బ్లాక్ బస్టర్ దేవర. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా నటించాడు. దసరా కానుకగా.. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. దాదాపు రూ.521 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో దేవర నాలుగో స్థానంలో నిలిచింది.
5 . విజయ్ గోట్ (రూ.460 కోట్లు)
The Goat
నటుడు దళపతి విజయ్‌కి తమిళంలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళనాడులో ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్లన్ని ఆలయాలుగా మారిపోతాయి. అయితే గతేడాది లియోతో మంచి హిట్ అందుకున్న విజయ్ ఈ ఏడాది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద రూ.460 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో గోట్ చిత్రం ఐదో స్థానంలో నిలిచింది.
6. భూల్ భూలయ్యా 3 (రూ.417 కోట్లు)
Bhool Bhulaiyaa 3
ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చి ‘స్త్రీ 2’ తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది భూల్ భూలయ్యా 3. చిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలు హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో రావడం విశేషం. కార్తిక్ ఆర్యన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో యానిమల్ భామ త్రిప్తి డిమ్రి కథానాయికగా నటించగా.. విద్యా బాలన్, మాధురీ దీక్షిత్ కీలక పాత్రల్లో నటించారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. రూ.417 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో భూల్ భూలయ్యా 3 ఆరో స్థానంలో నిలిచింది.
7. సింగం అగైన్ (రూ.398 కోట్లు)
Singham Again
బాలీవుడ్ నుంచి వచ్చిన మరో క్రేజీ మూవీ సింగం అగైన్. సింగం ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అజయ్ దేవగన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్గా నటించగా.. అర్జున్ కపూర్ విలన్ పాత్రలో నటించాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం రూ.398 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.
8. హన్-మాన్(రూ. 350 కోట్లు)
Hanuman
పుష్ప 2, కల్కి, దేవర చిత్రాల తర్వాత టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హన్మాన్ నిలిచింది. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు పోటీగా నిలబడి సూపర్ హిట్‌ను నమోదు చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో హన్-మాన్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
9. అమరన్ (రూ.320 కోట్లు)
Amaran
విజయ్ గోట్ తర్వాత తమిళం నుంచి వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ అమరన్. శివ కార్తికేయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటించింది. రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వం వహించాడు. మేజర్ ముకుంద్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద రూ.320 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో అమరన్ తొమ్మిదో స్థానంలో నిలిచింది.
10. ఫైటర్ (రూ.300 కోట్లు)
Fighter
హృతిక్ రోషన్ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రంలో దీపిక కథానాయికగా నటించింది. ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇంకా ఇవే కాకుండా.. మలయాళం నుంచి వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ (రూ.250 కోట్లు), రజనీ కాంత్ వెట్టయ్యాన్ (రూ.250 కోట్లు) అజయ్ దేవగణ్ షైతాన్ (రూ.212 కోట్లు), మహేశ్ బాబు గుంటూరు కారం (రూ.180 కోట్లు), విజయ్ సేతుపతి మహారాజ (రూ.170 కోట్లు), ది గోట్ లైఫ్ (రూ.150 కోట్లు), ఆవేశం (రూ.150 కోట్లు), రాయన్ (రూ.150 కోట్లు) చిత్రాలు అత్యధిక కలెక్షన్లు సాధించిన జాబితాలో నిలిచాయి.