Toxic | ‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్ ప్రస్తుతం నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొల్పింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. సినిమా నిర్మాణ వ్యయం దాదాపు రూ.500 కోట్లకు పైగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. యాక్షన్, హింసాత్మక నేపథ్యం, భారీ విజువల్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన రెండు గ్లింప్స్‌తో పాటు ఒక పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
తాజాగా ఈ సినిమా బడ్జెట్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రచారం ప్రకారం, మొత్తం బడ్జెట్లో దాదాపు రూ.100 కోట్లు ప్రధాన తారాగణం, దర్శకురాలు, కీలక సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్లకే వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. హీరో యశ్ ఈ సినిమా కోసం సుమారు రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని, అంతేకాకుండా సినిమా లాభాల్లో కూడా వాటా ఉండేలా ఒప్పందం చేసుకున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇక చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీకి సుమారు రూ.15 కోట్లు పారితోషికంగా అందుతున్నట్లు సమాచారం. కీలక పాత్రలో కనిపించనున్న నయనతారకు రూ.12 కోట్లు, మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న రుక్మిణి వసంత్‌కి రూ.3 కోట్లు ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే తారా సుతారియా, హ్యూమా ఖురేషిలకు చెరో రూ.2 కోట్ల వరకు పారితోషికం చెల్లిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో పాటు ఇతర కీలక సాంకేతిక నిపుణుల పారితోషికాలు కలిపితే మొత్తం రెమ్యూనరేషన్ వ్యయం రూ.100 కోట్ల మార్క్‌ను దాటే అవకాశముందని చర్చ జరుగుతోంది. కేవలం నటీనటుల పారితోషికాలే కాకుండా సినిమా నిర్మాణంపైనా భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భారీ సెట్లు, ప్రత్యేక ఆర్ట్ డైరెక్షన్, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. అందుకే ఆర్ట్ డిపార్ట్మెంట్, యాక్షన్ సీక్వెన్స్‌లు, సాంకేతిక అంశాలపై కూడా నిర్మాతలు భారీగా పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం.