వాణిజ్య పంథాలోనే ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో సిద్ధహస్తుడు అగ్ర హీరో విక్రమ్. శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి చిత్రాలు నటుడిగా ఆయన ప్రతిభను చాటిచెప్పాయి. ఆయన తాజా చిత్రం ‘తంగలాన్’ నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కించారు. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. చిత్ర విడుదలను పురస్కరించుకొని హీరో విక్రమ్ పంచుకున్న విశేషాలు…
‘తంగలాన్’ హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో పాటు రా కంటెంట్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది. సాధారణ సినిమా సూత్రాలు, గ్రామర్‌ను పక్కనపెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఓ విస్తారమైన జీవితం కనబడుతుంది.
‘తంగలాన్” అన్నది ఓ తెగ పేరు. ఇందులో బంగారం వేట అన్నది కథలో ప్రధానంగా కనిపించినా..వాస్తవంగా ఇది స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆ తెగ చేసిన పోరాటం, త్యాగాలకు అద్దం పడుతుంది. ఆకలి, అసమానతలను మనందరం జీవితంలో ఎప్పుడో ఓసారి ఎదుర్కొనే ఉంటాం. అందుకే ప్రతి ఒక్కరికి ఈ కథ కనెక్ట్ అవుతుంది.
దర్శకుడు పా.రంజిత్ రా కంటెంట్‌కు తనదైన కళాత్మకతను జోడించి భావోద్వేగభరితంగా చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఈ సినిమాలో అడ్వెంచర్‌తో పాటు అంతర్లీనంగా గొప్ప సందేశం ఉంటుంది. నా కెరీర్లో ఇప్పటివరకు చేసిన బెస్ట్రోల్ ఇదే అనుకుంటున్నా. భిన్న కోణాలు కలిగిన రెండు పాత్రల్లో చాలా సహజంగా కనిపించేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నా. ఆహారం లేక చిక్కిశల్యమయ్యే పరిస్థితుల్లో హీరో దృఢంగా కనిపిస్తే పాత్రలో సహజత్వం లోపిస్తుంది. అందుకే ఆ పాత్ర కోసం పూర్తిగా సన్నబడి కనిపించాను.
lషూటింగ్ టైమ్‌లో మేకప్ కోసమే గంటల కొద్ది సమయం పట్టేది. మళ్లీ మేకప్ తొలగించుకునేందుకు రెండు గంటలు అయ్యేది. తీవ్రమైన చలి, వేడిని భరిస్తూ షూటింగ్లో పాల్గొన్నా. మనకు ఇష్టమైన పని దొరికినప్పుడు ఆకలి, నిద్ర మరచిపోతాం. మిగతా విషయాలేవీ పట్టించుకోం. ఈ కథలోని ఇంటెన్సిటీ నచ్చడంతో షూటింగ్ పరమైన ప్రతికూలతల గురించి ఏమాత్రం ఆలోచించకుండా పాత్రలో లీనమై నటించా.
ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ వరల్డ్‌కు రీచ్ అయ్యే కథ. ఆ స్థాయిలో దర్శకుడు పా.రంజిత్ ఈ చిత్రాన్ని మలిచాడు. నిర్మాత జ్ఞానవేల్‌రాజా నిర్మాణపరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమాలోని ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.