‘నా కెరీర్లోనే అత్యంత ఆనందకరమైన క్షణాలివి. కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందనే నా నమ్మకాన్ని ఈ విజయం రుజువు చేసింది’ అన్నారు అగ్ర నటుడు వెంకటేష్. ఆయన కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల మందుకొచ్చి విజయపథంలో పయనిస్తున్నది. ఈ సందర్భంగా శుక్రవారం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే ఊత్సాహం కలిగిందని, ప్రేక్షకులు సూపర్‌డూపర్ హిట్ చేసినందుకు ఆనందంగా ఉందన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ‘నిర్మాతగా హిట్స్, ఫ్లాప్స్, బ్లాక్‌బస్టర్స్ అన్నీ చూశాను. అందులో కొన్ని సినిమాల విజయాలు ఏదో తెలియని కిక్‌నిచ్చాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మేము ఊహించని గొప్ప అద్భుతం. ఇది మాకు బ్లాక్‌బస్టర్ పొంగల్. ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కొత్త ఆలోచనలతో సినిమాను ప్రమోట్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో దర్శకుడు అనిల్ రావిపూడి నిరూపించారు’ అన్నారు.
ఈ సినిమా మా సమస్యలన్నింటిని తీరుస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి షూటింగ్ సందర్భంలో పదే పదే చెప్పేవారని, ఈ రోజు విజయంతో ఆయన మాటలు నిజమయ్యాయని నిర్మాత శిరీష్ ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘దిల్‌రాజు, శిరీష్ నన్ను దర్శకుడిగా నిలబెట్టిన నిర్మాతలు. ఈ సంస్థను నా హోమ్ బ్యానర్‌గా ఫీలవుతా. వారితో నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. వెంకటేష్‌గారికి ఓ అభిమానిలా ఈ సినిమా తీశా.
మా ఇద్దరి కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ హిట్. దర్శకుడిగా ఎనిమిది సినిమాల ప్రయాణం నాది. అందులో చివరి ఐదు చిత్రాలు వందకోట్ల వసూళ్ల మైలురాయిని దాటాయి. ప్రేక్షకులు థియేటర్లో విజిల్స్ కొట్టే సినిమా చేయడం నాకు ఇష్టం. అలాంటి సినిమాలే చేస్తాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయిక ఐశ్వర్యరాజేష్, అవసరాల శ్రీనివాస్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.