‘ఓ అందమైన జంట కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ద్వారా మరింత మంది ప్రేక్షకుల ప్రేమను సంపాదించుకుంటాననే నమ్మకం ఉంది’ అన్నారు ప్రియదర్శి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమంటే’. ’థ్రిల్లు ప్రాప్తిరస్తు’ ఉపశీర్షిక. ఆనంది కథానాయికగా నటించింది. నవనీత్శ్రీరామ్ దర్శకుడు. జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు.ఈ నెల 21న విడుదలకానుంది. మంగళవారం నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హీరో నాగచైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల ముఖ్యఅతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు.
ప్రియదర్శి అన్ని రకాల పాత్రల్ని అద్భుతంగా పోషించే నటుడని నాగచైతన్య ప్రశంసించారు. కెరీర్ ఆరంభం నుంచి ప్రియదర్శి వైవిధ్యమైన కథలకు చిరునామాగా నిలుస్తున్నారని శేఖర్ కమ్ముల అన్నారు. ఏషియన్ వంటి భారీ నిర్మాణ సంస్థలో సినిమా చేయడం ఆనందంగా ఉందని ప్రియదర్శి చెప్పారు. దంపతుల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఓ చాయ్ తాగుతూ మాట్లాడుకొని వాటిని పరిష్కరించుకోవాలనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించానని దర్శకుడు తెలిపారు. ఆద్యంతం చక్కటి హాస్యంతో అలరించే ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ ఇదని నిర్మాత జాన్వీ నారంగ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.