Jr NTR | ఇప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ పురస్కారాన్ని అందుకొని.. భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని గ్లోబల్ ప్లాట్‌ఫాంపై ఘనంగా చాటిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ టీం మరోసారి వార్తల్లో నిలిచి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ (Academy of Motion Picture Arts and Sciences) కమిటీలో సభ్యులుగా ఉండేందుకు హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్, సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్లకు ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తన ఎక్జయిట్‌మెంట్‌ను నెట్టింట షేర్ చేసుకున్నాడు.
కాగా ఈ గౌరవప్రదమైన క్షణాలను ఆస్వాదిస్తున్నాడు తారక్ (Jr NTR). ‘ప్రతిష్టాత్మక ఆస్కార్ కమిటీ నుంచి ఆహ్వానం రావడం పట్ల తన సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు. రామ్ చరణ్, ఎంఎం కీరవాణి, సెంథిల్ కుమార్, చంద్రబోస్, సాబు సిరిల్, నన్ను అకాడమీ అవార్డ్స్ 2024కి సభ్యులుగా ఆహ్వానించడం RRR కుటుంబ సభ్యులైన మనందరికీ గర్వకారణం. ఈ గొప్ప గౌరవానికి వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మాకు ఈ అత్యంత అరుదైన గౌరవాన్ని అందించినందుకు అకాడమీకి ధన్యవాదాలు. అదేవిధంగా అకాడమీ నుండి ఆహ్వానాలు అందుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని నా సహచర మిత్రుల బృందానికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నానని’ ఓ ప్రకటనలో తెలియజేశాడు తారక్.
11 మందికి ఆహ్వానం..
ఆస్కార్ ప్యానెల్లో ఈ ఏడాది 398 మందికి కొత్తగా చోటు కల్పించనుండగా.. ఇండియా నుంచి 11 మంది సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.ఈ ఆహ్వానాలు అందిన వారిలో ఆర్ఆర్ఆర్ టీంతోపాటు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, కరణ్‌జోహార్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, చైతన్య తమహానే, షానెక్ సేన్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఆస్కార్ అవార్డుల ఎంపికలో వీరందరికి ఓటు హక్కు ఉండనుంది. ఆస్కార్ కమిటీ ఆహ్వానాన్ని అందుకున్న తొలి తెలుగు హీరోలుగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ మరో అరుదైన రికార్డును దక్కించుకుని.. టాలీవుడ్ రేంజ్‌ను మరోసారి గ్లోబల్ ఫిలిం ఇండస్ట్రీకి చాటి చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర (Devara)లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతుంది. దేవర 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దేవర ఫస్ట్ లుక్..
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023