Hema Chandra | ఒకప్పుడు టాలీవుడ్లో క్యూట్ కపుల్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందిన జంట శ్రావణ భార్గవి – హేమచంద్ర. వీరిద్దరు వేర్వేరు దారుల్లో నడుస్తున్నారని చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరికీ ఒక పాప ఉంది. అయితే సుమారు మూడు సంవత్సరాల క్రితమే వీరు విడిపోయారని సోషల్ మీడియా పోస్టుల ద్వారా అభిమానులు అంచనా వేస్తున్నా, ఈ విషయం గురించి ఇద్దరూ ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. తాజాగా హేమచంద్రకి ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. మీ పెళ్లి జీవితంపై వస్తున్న రూమర్స్, కామెంట్లకు ఎందుకు స్పందించడం లేదని అడగగా, హేమచంద్ర ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వార్తలు నిజమా కాదా అన్నది పక్కన పెడితే, అవి తెలుసుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ముందుగా చెప్పమని చెప్పండి. అప్పుడు మాత్రమే తాను సమాధానం ఇవ్వగలనని హేమచంద్ర అన్నారు. తనపైన వచ్చే కామెంట్లు లేదా రూమర్స్ తనను ఏ విధంగానూ ప్రభావితం చేయవని, సింగర్‌గా తన పనిపై మాత్రమే మాట్లాడదలచుకున్నానని ఆయన స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటే ఓ Q&A సెషన్ పెట్టొచ్చని, కానీ ముందుగా “ఈ విషయం నీకు ఎందుకు ఉపయోగపడుతుంది?” అనే ప్రశ్నకు వాళ్లు ఇచ్చే సమాధానం తనను సంతృప్తిపరచాలి అన్నారు.
విమర్శలు చేసే వారి మాటలు పట్టించుకునేంత టైం లేదని, జనాలు పక్క వాళ్ల వ్యక్తిగత జీవితాలపై సహజంగానే ఆసక్తి చూపుతారని, వర్క్ గురించే తెలిస్తే దాని గురించి మాట్లాడాలి తప్ప పర్సనల్ విషయాలు తెలుసుకోవడం అనవసరం అంటూ హేమచంద్ర వ్యాఖ్యానించారు. అయితే ఈ ఇంటర్వ్యూలో కూడా ఆయన శ్రావణ భార్గవితో నిజంగా విడిపోయారా లేదా? విడాకులు తీసుకున్నారా? ప్రస్తుతం వారి సంబంధం ఏ స్థితిలో ఉంది? అనే విషయాలకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీనితో హేమచంద్ర ఇంటర్వ్యూ మరింత చర్చకు దారితీస్తోంది కానీ, పాత రూమర్స్‌కు మాత్రం ముగింపు పడలేదు.