Heeramandi 2 | సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’ తొలి సీజన్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, రిచా చద్దా, షర్మిన్ సెగల్ తదితర నటీమణులందరినీ భన్సాలీ తన ప్రత్యేక మేకింగ్‌లో అద్భుతంగా చూపించాడని ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసించారు. విడుదలకు ముందు కథ పాత కాలానికి చెందినదన్న కారణంగా సందేహాలు వ్యక్తమైనప్పటికీ, రిలీజ్ తర్వాత ప్రేక్షకుల ప్రేమ ఆ సందేహాలన్నింటినీ పక్కన పెట్టించింది.ఇక ఇప్పుడు సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ లభించింది. సిరీస్ రైటర్ విభు పూరి తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం, ‘హీరామండి 2’ స్క్రిప్ట్ దశలో ఉంది మరియు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
తొలి సీజన్‌లోని ప్రధాన పాత్రలే కొనసాగనున్నాయి. అయితే వీటితో పాటు పలు కొత్త పాత్రలు కూడా జోడించనున్నారట. బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కొత్త పాత్రల్లో రెండు కీలక రోల్స్ కోసం తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. సౌత్ మార్కెట్లో ‘హీరామండి’ మరింతగా కనెక్ట్ కావడం, ఈ ఇద్దరు నటీమణులు పాన్-ఇండియాలో గుర్తింపు తెచ్చుకోవడం, తొలి సీజన్లో నటించిన నటీమణుల వయస్సు, ఇమేజ్‌కి ఇవి సరిపోవడం.తమన్నా (వయసు 35+), కాజల్ (40+) స్టార్ హీరోయిన్స్గాను, ఐటమ్ నంబర్లలోనూ, హై వాల్యూ ప్రాజెక్ట్స్‌లోనూ సత్తా చాటిన నటీమణులే.
గత కొన్నేళ్లలో వీరి సినిమాల సంఖ్య తగ్గినా, ఇలాంటి ప్రతిష్టాత్మక ఓటీటీ ప్రాజెక్టులు కెరీర్లో మళ్లీ కొత్త బాటలు తీసుకువెళ్లే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సౌత్‌లో బలమైన ఫాలోయింగ్ ఉండటం, ప్యాన్-ఇండియా ఆకర్షణ కలగడం వల్ల ఈ ఇద్దరూ భన్సాలీ కథలో సరిగ్గా సరిపోతారనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో నడుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం త్వరలోనే రానుంది. ఒకవేళ ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే, ‘హీరామండి 2’లో తమన్నా–కాజల్ స్క్రీన్ ప్రెజెన్స్ మరో లెవెల్లో ఉండనుంది.