Hebah Patel | నటుడు శివాజీ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా ఇండస్ట్రీలో పేరుంది. రాజకీయ అంశాలైనా, సినీ రంగానికి సంబంధించిన విషయాలైనా తన అభిప్రాయాన్ని ఎలాంటి సంకోచం లేకుండా వెల్లడించడం ఆయన శైలి. అదే తీరులో తాజాగా ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఆ ఈవెంట్లో శివాజీ స్టేజ్‌పైకి ఎక్కగానే సినిమా గురించి మాట్లాడతారని అందరూ భావించారు. కానీ ఆయన సడన్‌గా హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. చీరలోనే అసలైన అందం ఉంటుందని, హీరోయిన్లు ఏది పడితే అది ధరించకూడదని చెప్పిన శివాజీ, ఆ క్రమంలో ఉపయోగించిన పదజాలం తీవ్ర విమర్శలకు గురైంది.
ఈ వ్యాఖ్యలతో టాలీవుడ్లో పెద్ద దుమారం చెలరేగింది. యాంకర్ అనసూయ భరద్వాజ్, గాయని చిన్మయి వంటి పలువురు ప్రముఖులు శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. తప్పు దుస్తుల్లో లేదని, చూసే వారి దృష్టిలో ఉందని పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు కూడా స్పందించారు. వివాదం తీవ్రరూపం దాల్చడంతో శివాజీ తన వ్యాఖ్యలపై స్పందిస్తూ వెనక్కి తగ్గారు. ఆవేశంలో కొన్ని పదాలు నోరు జారినట్లు అంగీకరించిన ఆయన, ఆ పదాల వల్ల బాధపడిన మహిళలకు క్షమాపణలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై హీరోయిన్ హెబ్బా పటేల్ స్పందించారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఈ అంశంపై ప్రశ్నించగా, ఆమె తనకు ఇతరుల వ్యాఖ్యలపై స్పందించడం లేదా వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఇష్టం లేదని చెప్పారు. ఇలాంటి విషయాల నుంచి దూరంగా ఉండడమే మంచిదని పేర్కొన్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పారు . ఒక మహిళకు తనకు నచ్చిన దుస్తులు వేసుకునే పూర్తి స్వేచ్ఛ ఉందని.
హెబ్బా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన హెబ్బా పటేల్, తొలి సినిమాతోనే యూత్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో గ్లామర్ రోల్స్‌లో కనిపిస్తూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించింది. స్పెషల్ సాంగ్స్‌కూ ఓకే చెబుతూ తన పాపులారిటీని నిలబెట్టుకుంటోంది. తాజాగా హెబ్బా నటించిన ‘ఈషా’ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులని అలరిస్తుంది.